పుట:Andhrula Charitramu Part 2.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దగ్రులై హరహరాయని ఖడ్గములుదూసిపై బడి యాతనిని ముక్కలుచెక్కలుగ చెలగిపారవైచిరి. ఈ క్రూరసంహారకులంతట నంతఃపురమున నుండనొల్లక సాహసవృత్తిచే దప్పించుకొనివచ్చి వీధినబడి తాము చేసిన పనికింగారణము చెప్పుచు కత్తులం ద్రిప్పుచు చెలరేగుచుండిరి.

ఘోరమైన మతయుద్ధము.

అంతట జైనులతోడను వీరశైవులతోడను నిండియుండిన యామహాపట్టణమున నీమహాఘోర సంహారవృత్తాంత మంతయు నొక క్షణములో వ్యాపించి సంక్షుభిత మయ్యెను. పౌరజనంబులు, జైనులును వీరశైవులు నను నిరుకక్షలంజేరి, ద్వంద్వయుద్ధము చేయగడంగిరి. ఇట్లు మనుష్యులు మనుష్యులతోను, అశ్వికులాశ్వికులతోను, గజాధిరూఢులు గజాధిరూఢులతోను, రథికులు రథికులతోను బాలురు బాలురతోను, ఘోరముగా బోరాడిరి. పట్టణమంతయు నెమ్ములరాసులతోను, మాంసపిండములతోను, నెత్తురు వరదలతోను, మునిగిపోయి మిగుల భయంకరముగ నుండెను. బసవేశ్వరుడు సంగమేశ్వర క్షేత్రమునకు బోయి శివుని దేహములో గలిసిపోయెను. [1]

చెన్నబసవేశ్వరుడు.

జైనులు వ్రాసిన వృత్తాంతము మరియొక విధముగా గన్పట్టుచున్నది. బిజ్జలుడు శిలాహార రాజగు రెండవ భోజుని వశపరచుకొనుటకై కొల్లాపురముపై దండెత్తిపోయెను. దండయాత్ర ముగించి మరలి రాజధానికి వచ్చునప్పుడు భీమానది యొడ్డున నొకానొక ప్రదేశమున విడిచియున్న కాలమున బసవేశ్వరుడొక జంగమునకు జైనవేషమును ధరింపించి విషపూరితమైన యొక ఫలమునిచ్చి యతనికడకు బంపెనట. బిజ్జలుడు జైనుడగుటవలన ననుమానింపక యామాయవేషధారివలన నా ఫలమును స్వీకరించి వాసన

  1. Jour. B.B.R.A.S., Vol.VIII., p.96; Wilson's Mackingie Mss. pp.300-310