పుట:Andhrula Charitramu Part 2.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాక, సైన్యాధ్యక్షునిగను, దనాగారాధ్యక్షునిగను నియమించెను. ఇతడు మహారాజునకు దరువాత మహారాజువలె, తన యధికారము రాష్ట్రమునందంతట నెరపుచుండెను.


బిజ్జలునికి బసవేశ్వరునకుగల సంబంధము.

బిజ్జలుడు తన చెల్లెలగు నీలలోచనయనునామెను బసవేశ్వరునకిచ్చి వివాహము చేసెనని బసవ పురాణమునందు జెప్పబడినది. అయినను జైనులు వ్రాసిన బిజ్జలరాయని చరిత్రమునందు మరియొక విధముగా దెలుపబడినది. బసవేశ్వరునకు మిక్కిలియందకత్తె యగు పద్మావతియను చెల్లెలు కలదట. బిజ్జలుడామెను మోహించి వివాహము చేసికొనియెనట. [1]ఇందేది సత్యమైనను బసవేశ్వరునకును బిజ్జలునకును బాంధవ్యము కలదనుట కేయాక్షేపమును లేదు.

బజవేశ్వరునికి బిజ్జలునితోడి విరోధము.

ఇట్టి మహోన్నత పదవికి బసవేశ్వరుడు వచ్చినను తన మతమును, తన దేవుని మరవలేదు. ఇతడనేకాద్భుత కార్యముల నెరవేర్చినట్లుగ బసవపురాణము పేర్కొనుచున్నది. ఇతనికి చెన్నబసవయ్య యను మేనల్లుడు కలడు. ఈ చెన్నబసవయ్య నాగలాంబిక పుత్త్రుడు. ఇతనితోడి గలిసి బసవేశ్వరుడు తన మతమును వ్యాపింపజేయసాగెను. ఇతడు విషయాసక్తులయిన జంగమగురువులను రాజుయొక్క ధనముతో బోషించుచుండెను.[2] ఇట్లు సర్వస్వాతంత్ర్యమును వహించి యక్రమముగా ధనాగారాములోని ధనమునంతయు జంగాలపాలు చేయుచుండుట జూచి బసవేశ్వరునికి విరోధియగు మంచన్న యను మరియొక మంత్రి, బిజ్జలునకీ సంగతిని దెలియజేసెను.

  1. Sir W.Elliot's paper, Jour.R.A.S., Vol.IV., p.20.
  2. Jour. B.B.R.A.S., Vol.VIII., pp.78 & 89.