పుట:Andhrula Charitramu Part 2.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు నిన్ను తిట్టినను గొట్టినను వారికి సాష్టాంగప్రణామంబులాచరింపుము; వీరశైవులయిన యెడ వారు నీకు శత్రువులయినను వారిపట్ల మిత్త్రులభంగి వర్తింపుము; లింగాయతులను దూషించువారిని శిక్షించుచు నా మతమును వ్యాపింపజేయుటకు బ్రయత్నింపుము; శివుని కర్పింపక యే వస్తువును భుజింపకుము; పరధనపరదారాపేక్షకుడవు గాకుండుము; ఇంద్రియాధీనువడు గాక దృఢమైన హృదయము గలిగియుండుము; జంగముడ నేనేయని యెరుంగుము. లింగాయతులను నీవు గాంచినప్పుడు వారికి నమస్కరింపుము; ఎల్లప్పుడును శివుని స్మరించుచుండుము; సత్యమును వచింపుము; సత్కార్యములాచరింపుము"అని యుపదేశించి, బసవుని కౌగిలించికొని యదృశ్యుడయ్యెనట. శివుడీవిధముగా దనకుపదేశించిన మతసిద్ధాంతములను బ్రజలకు బోధించుచు నితడు వీరశైవమతమును వ్యాపింపజేయుచుండెను. అనేకలీతని మతమునవలంబింపసాగిరి. బ్రాహ్మణులు భయపడి యితని జోలికిబోవుట మానిరి.

బసవేశ్వరుడు మంత్రియగుట.

తరువాత కొంతకాలమునకు బలదేవుడు మృతినొందెను. అప్పుడు రాజగు బిజ్జలుడు బలదేవుని బంధువర్గమును రప్పించి మంత్రిపదవికర్హులెవ్వరని యడుగగా వారా మహాపదవి వహించుటకు బలదేవుని యల్లుడగు బసవరాజు యోగ్యుడని విన్నవించిరి. బిజ్జలుడు దాని నంగీకరించి తన యుద్దేశమును దెలుపుటకు బసవరాజుకడకు కొందరు మంత్రులను బంపెను. వారు కప్పడి గ్రామమునకు విచ్చేసి రాజు సందేశమును బసవేశ్వరునకు దెలియజెప్పగా, నాతడు మొట్టమొదట దనకాపని యక్కరలేదని చెప్పెను. ఆ వచ్చిన వారు ఈ పదవి శైవమతవ్యాప్తికనుకూలముగ నుండునని విన్నవించి కైకొనవలసినదని ప్రార్థిపంగా, నంగీకరించి కళ్యాణపురికి బోయెను. అతని జ్యేష్ఠసోదరి నాగలాంబికయు నతనితో గూడ నుండెను. అతడాపట్టణమునకు బోయినప్పుడు బిజ్జలుడు పౌరజనంబులతో నెదురువచ్చి యేనుగును దిగి స్వాగతమిచ్చి యాస్థానమునకు గొనిపోయి ప్రధానమంత్రి పదమున మాత్రమే