పుట:Andhrula Charitramu Part 2.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శైవమతోద్ధారకుడైన బసవేశ్వరుడు.

శైవమతోద్ధారకుడయిన బసవేశ్వరుని చరిత్రము తెలుగు బసవపురాణమునందును, కన్నడ బసవపురాణమునందును, అత్యద్భుతముగా వర్ణింపబడినది. [1]బసవేశ్వరుడు శ్రీశైలమునకు పశ్చిమముననుండు హింగుళేశ్వరాగ్రహారమునందు నివసించుచుండిన శివభక్తుడైన మండంగి మాదిరాజను బ్రాహ్మణునికి జనించెను.[2]ఈ బసవరాజు శివుని వాహనమైన నందియొక్క యంశముచేత భూమిమీద నవతరించెనని వీరశైవులు విశ్వసించుచున్నారు. కళ్యాణపురాధీశ్వరుడైన బిజ్జలరాయని కడ బసవరాజునకు మేనమామయైన బలదేవుడు ప్రధానమంత్రిగనుండెను. బసవరాజు తల్లిదండ్రులగు మదాలాంబికయు, మాదిరాజును చిరకాలము తమకు సంతానము లేమిచే నొకనాడు సంతానార్థమై తమ కులదేవుడగు నందీశ్వరునికి మిక్కిలి భక్తితో ముడుపుగట్టిరట. తమ మతాచరణ విధులప్రకారము పూజార్చనలు ముగించిన తరువాత నందీశ్వరుడు ప్రత్యక్షమై మీ కోరిక ఫలించునని చెప్పి యంతర్థానమొందెనట. మదాలాంబిక గర్భమున నందీశ్వరుడుదయించి మూడు సంవత్సరములు గర్భముననే యుండుటచేత నా సాధ్వీమణికి గర్భవేదనయధికమయ్యెను. ఆ వేదన భరింపజాలక ఆయమ నందినాధుని యాలయమునకు బోయి ప్రార్థించెను. ప్రార్థనాదికము ముగిసిన తరువాత నామె

  1. తెలుగు బసవపురాణమును పాలకురికి సోమనాథకవి ద్విపద కావ్యముగా రచించియున్నాడు. ఇతడు రెండవ ప్రతాపరుద్రుని కాలములోనివాడు. కన్నడ బసవపురాణమును రచించినవాడు భీమకవి. ఇతడు దేవరాయల కాలములో నుండుట చేతను, మత గ్రంథమునందు పాలకురికి సోమనాథుని బేర్కొనియుండుట చేతను ఆంధ్రబసవపురాణమే మొదటిదిగానూహింపదగియున్నది.
  2. కన్నడబసవ పురాణమునందు బసవరాజు కాలడిగి జిల్లాలోని భాగెవాడి గ్రామమున జనించినట్లు చెప్పబడినది