పుట:Andhrula Charitramu Part 2.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విక్రమచోడుడు ద్రావిడదేశమునకుబోయి సింహాసనమెక్కెను. విక్రమచోడుడు వేంగిదేశమును విడిచిపెట్టిన తరువాత నాతనికి దక్షిణమున బల్లాలరాజువలన జిక్కులెక్కువైనందున వేగిదేశము విషయమై శ్రద్ధలేకయుండెను. 1121వ సంవత్సరమున పశ్చిమచాళుక్యుడగు విక్రమాదిత్యుడు వేంగిదేశమునపై దండెత్తివచ్చి వశపరచుకొనియెనని యాంధ్రులచరిత్రము ప్రథమభాగమున జెప్పియున్నాడను. ఇతడాంధ్రదేశమును జయించి నాలుగయిదు సంవత్సరములు పరిపాలనము చేసెను. ఆ కాలమునందు విక్రమాదిత్యుడు, వెలనాటిచోడుని కుమారుడును మహామండలేశ్వరుడునగు వెలనాటి రెండవ గొంకరాజును రాజప్రతినిధిగ నియమించెను. ఈ పశ్చిమ చాళుక్య చక్రవర్తి 1126వ సంవత్సరమున మృతినొందెను. చోడచక్రవర్తియగు కులోత్తుంగుని మరణముతో చోడసామ్రాజ్యముయొక్కయు, విక్రమాదిత్యుని మరణముతో చాళుక్యసామ్రాజ్యముయొక్కయు, వైభవము క్షీణింపనారంభించెను. విక్రమాదిత్యునికి బిమ్మట భూలోకమల్లుడు సింహాసనమునకు వచ్చెను. విక్రమాదిత్యుని మరణానంతరము వానికి సామంతులుగనున్న మహామండలేశ్వరులలో నొక్కడగు కాకతీయ ప్రోలరాజు ఆంధ్రసామ్రాజ్య భవన నిర్మాణమునకై పునాదినుంప బ్రయత్నించుచుండెను. ఇతని చరిత్రము మరియొక ప్రకరణమునందు దెలుపబడును; గావుననిచ్చట వివరింపలేదు. క్రీ.శ.1127వ సంవత్సరముననే విక్రమచోడుడు వెలనాటిని మరల స్వాధీనముజేసికొన్నట్లు విక్రమచోడునిచే బ్రోలుశాసనము వలన దెలియుచున్నది. అయినను ఆంధ్రదేశములోని పశ్చిమభాగమునున్న మహామండలేశ్వరులందరును పశ్చిమచాళుక్య చక్రవర్తులకే కప్పముగట్టుచుండిరి.


భద్రపాలుడు.

భువనైకమల్లునకు గప్పముగట్టుచుండిన సామంతప్రభువులలోనొక్కడగు భద్రపాలుడు, షట్సహస్రదేశమనియెడు నారువేల నాటిని బరిపాలనము చేయుచుండెను. వీనికి రాజరాజమనోజుడనియు,