పుట:Andhrula Charitramu Part 2.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పము సంభవింపదనియును, ఖండించుచు భక్తివిధానమున శంఖచక్రగదాధారియు గరుడ వాహనారూఢుడునగు లక్ష్మీపతియే సర్వేశ్వరుడని బోధించుచు వచ్చెను. చోడచక్రవర్తి శంకరమతావలంబకుడగుట వలన రామానుజుని మతబోధము సరిపడకుండెను. ఈ చోడచక్రవర్తి యాంధ్రభారత కృతిపతియైన రాజరాజనరేంద్రుని కుమారుడగు కులోత్తుంగచోడదేవుడేగాని యన్యుడుగాడు. ఇతడు శైవభక్తుడగుటవలన దన రాజ్యమునందలి ప్రజలెల్లరును శివునే దైవముగా నంగీకరింపవలసినదని ప్రకటింపించెను. అందులకు రామానుజుని శిష్యులునిరాకరించిరి. అందుపై జక్రవర్తికాగ్రహము జనించి రామానుజునిబట్టి తనయొద్దకు గొనిరమ్మని భటులకుత్తరవు చేసెను. పరమ మాహేశ్వరాచార భక్తిపరుడైన చక్రవర్తియాజ్ఞను శిష్యవర్గముచే రామానుజుడు విని మారువేషముతో వెంటనే కాంచీపురమును విడనాడి హోసలరాజుచే బరిపాలింపబడు గాంగవాడిదేశమునకు బారిపోయెను.

విఠలదేవరాయలు.

అప్పుడు విఠలదేవరాయలు గాంగవాడిదేశమును బరిపానము చేయుచుండెను. ఇతడు క్రీ.శ.1106వ సంవత్సమున రాజ్యాధిపత్యము వహించినటుల గన్పట్టుచున్నది. [1]ద్వారసముద్రము లేక హాలెవీడు రాజధానిగ హోసలబల్లాలరాజులు గాంగవాడి దేశమును బరిపాలించుచుండిరి. వీరు మొదట జైనమతావలంబకులుగనుండిరి. ఈ బల్లాలరాజైన విఠలదేవరాయలు పశ్చిమచాళుక్య చక్రవర్తియగు యారవ విక్రమాదిత్యునికి సామంతులుగనుండిన మహామండలేశ్వరులలో బరాక్రమవంతుడుగను బ్రసిద్ధుడుగనుండెను. రామానుజుడు తన శిష్యవర్గముతో నీతని రాజ్యమున బ్రవేశించి జనులకు మతోపదేశమును జేయుచు రాజధానీనగరమునకు వచ్చి కొంతకాలమచ్చటనే నివసించియుండెను. అప్పుడాదేశపు రాజు

  1. The Making of Mysore by S.Krishnawamy Aiyangar, M.A., p.14