పుట:Andhrula Charitramu Part 2.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము.

241

అందు తనభర్తపేరిట బేతేశ్వరనామముతో లింగప్రతిష్ఠ గావించెను. ఈ బేతేశ్వరా లయగోపురమునందుగూడ సువర్ణకలశములను బెట్టించెను. ఈశివాలయము సంరక్షణముకొఱకు ధాన్యసమృద్ధ మైన బెనదేవి యనుగ్రామము నొసంగి దానశాసనము వ్రాయించెను. ఇంతియగాక బ్రాహ్మణుల కనేకదానములను గావించెను. మఱియును దనతండ్రి గణపతిదేవచక్రవర్తిపేరిట గణపేశ్వర శివాలయమును నిర్మింపించి దానిసంరక్షణమునకుఁ గాను చింతపా డను గ్రామమును దానము చేసెను. ఈమె మహేశ్వరధ్యానము చేయుచుఁ దనయవసాన కాలమును గడిపెనని చెప్పబడినది.1[1]

బుద్ధవర్మవంశము-కొండపడమటి బుద్ధరాజు.

ఇతడు కొండపడమటిసీమకు ప్రభువు. కనుక నితనికి గిరిపశ్చిమ శాసనుఁ డనుబిరుదము గలదు. ఇతఁడు చోడచక్రవర్తులకు సామంతుఁడుగ నుండెను. వెలనాటి ప్రభువులకు ముఖ్యబంధువు. ఇతడు బుద్ధవర్మవంశములోని వాఁడ ననియు, చతుర్థాభిజనుండ ననియుఁ జెప్పుకొని యున్నవాఁడు. ఇతడు కొండవీటికి బశ్చిమ భాగమున నున్న సీమను బరిపాలనముఁ జెయుచు వెలనాటిరాజులతోడి భాంధవ్యమువలనఁ బ్రఖ్యాతి గాంచెను. వెలనాటిరాజుల యొక్క రాణులందఱు నీబుద్ధరాజవంశమున జనించినవారు. ఇతనియొక్క శాసనములు నరసరావుపేట తాలూకాలోని నాదెండ్లలోను, గుంటూరు తాలూకాలోని చేబ్రోలు లోను గలవు. ఇతనిశాసనములలో దుర్జయకులాభరణుఁ డనియు, ఏలాదయసింహుఁ డనియు, అనియాంకభీముఁ డనియు బిరుదము లీతనికిఁ గలవని చెప్పబడియెను. బుద్ధవర్మవంశమున మండరాజును, అతనికి గండమరాజును, అతనికి (రెండవ) మండరాజును, అతనికి గుండాంబిక యందు మల్లరాజు, బుద్ధరాజు, అంకమ, లేక అక్కమ్మయు జనించెను. వీరిలో రెండవవాఁడే మనబుద్ధరాజు. ఇతనిచెల్లె లయిన అక్కమ్మను వెలనాటి ప్రభువైన రాజేంద్రచోడునకిచ్చి వివాహము చేయఁబడియెను. ఈరాజేంద్ర

  1. 1. Epigraphia Indica. No.16, Yanamadala Inscription.