పుట:Andhrula Charitramu Part 2.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సమగ్రము - సప్రమాణము

సమగ్రమును, సప్రమాణమునగు నాంధ్రదేశచరిత్రము వ్రాయుట మిక్కిలియగత్యమె కాని యొక్కసారిగా సమగ్రమును సప్రమాణమునగు చరిత్రము వ్రాయుట సాధ్యముగాదు. ఒకనికి సప్రమాణముగ గన్పట్టినది యింకొకనికి నప్రమాణముగ గన్పట్టుచుండును. ఒక కాలమునందు సమగ్రరమనిపించుకొన్నది మరియొక కాలమునందసమగ్ర మనిపించుకొనును. కాలము గడిచినకొలది, జనసామాన్యమునకు స్వదేశచరిత్రమునందభిరుచి పుట్టిన కొలది, విద్యాభివృద్ధి కలిగిన కొలది, చరిత్ర సాధనములు పెంపొందిన కొలది, చరిత్ర పరిశోధన మభివృద్ధి గాంచిన కొలది, ఉత్కృష్ట మేధావంతులు జనించిన కొలది, దేశచరిత్రము దినక్రమప్రవర్ధమానమై వన్నెగాంచుచుండును. అంతియకాని సమగ్రమును సప్రమాణమునగు చరిత్రమొకనిచే గాని బహుజనులచేగాని యేకకాలమునందు వ్రాయనలవికాదని తెలిసికొనవలయును. ఆంధ్రదేశచరిత్రము వ్రాయుటకు శాసనములు ముఖ్యాధారములు. ఇయ్యవి వేలకొలది కలవు. కొన్ని ప్రకటింపబడినవి. మరికొన్ని ప్రకటింపబడవలసియున్నవి. ఇంకను వేలకొలది ప్రతు లెత్తుకొనబడవలసియున్నవి. వీని నన్నింటిని పరిశోధించి సమన్వయించుకొన వలయును. ఇంకను భావికాలమున శిలాశాసనముల తామ్రశాసనములు బయలుపడి క్రొత్తచరి