పుట:Andhrula Charitramu Part 2.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లైకమత్యములేక యొండొరులతో గలహించి పోరాడుచున్నను, ఆ కాలమునందలి పరిపాలనాపద్ధతులను బట్టి మతసాంఘికస్థితుల కంతగా నలజడి కలిగియుండునని తలంపరాదు. గ్రామపరిపాలనము ప్రజల స్వాధీనమునందుండచేత ప్రభుత్వము చేయు రాజులు మహారాజులు మారుచుండినను గ్రామపరిపాలనా పద్ధతులు మారకుండెను. అందువలన దేశమున రాజకీయపు గలవరమెంత యున్నను, మతసాంఘికస్థితులు చెక్కుచెదరకయుండెను. ప్రభుత్వము చేయు రాజులుగాని, రారాజులుగాని, ప్రజలు మతసాంఘికస్థితులయందు జోక్యము కలుగచేసికొన్నప్పుడే గొప్ప సంక్షోభము జనించును. ఈ తెలుగుచోడరాజులెన్నడు నట్టి జోక్యమును కలిగించుకొన్నట్టు దృష్టాంతములు గానరావు. ఈ చోడరాజులలో పెక్కండ్రు వైష్ణవమతమవలంబించి పెక్కు విష్ణ్వాలయములను నెలకొల్పి వసతులేర్పాటుచేసి నూతన వైష్ణవమతమును వ్యాపింపజేసిరి. అయినను, మతసహనబుద్ధి కలిగి శైవులతో వైరమును పెంచుకొనక కొందరు శివాలయములకును వృత్తులనేర్పరుచువచ్చిరి. కమ్మనాటిచోడులు శైవులుగను, పాకనాటిచోడులు వైష్ణవులుగనుండిరి. ఈ తెలుగు చోడ రాజుల కాలముననే ఈ యాంధ్రభూభాగమునకు దక్షిణమునుండి వైదికబ్రాహ్మణులును, ఉత్తరపశ్చిమములనుండి నైయోగికబ్రాహ్మణులును వచ్చి స్తిరనివాసులైరి.
చాళుక్యచోడచక్రవర్తులలో గడపటివారనగా రాజరాజనరేంద్రుని తరువాతివారు వేంగీదేశమునందుండక ద్రావిడదేశమునందున్న వారగుటచేత వారికాంధ్రభాషకంటె ద్రావిడభాషయే యభిమానపాత్రమయ్యెను. అయినను వారికి సామంతులుగనుండిన మన ఈ తెలుగుచోడరాజుల కాలమున మన ఈ యాంధ్రభాష మహోత్కృష్టదశకు వచ్చినదని చెప్పుటకొక్క తిక్కనసోమయాజి పేరు చెప్పినచాలును. వీరి పరిపాలనయందు దేశభాషాభివృద్ధిమాత్రమేకాక జనాభివృద్ధియు, వర్తకాభివృద్ధియు, సస్యవృద్ధియు లభించియుండెను. అరణ్యములు ఛేదింపబడి గ్రామములు, పట్టణములు నిర్మింపబడినవి. చక్కనిబాటలేర్పరుపబడినవి. బాటలకిరుప్రక్కల వృక్షములును, అచ్చటచ్చట బాటసారులకు విశ్రాంతిగృహము