పుట:Andhrula Charitramu Part 2.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దానికన్నను ప్రాచీనమైనదిగ నుండెను. రాజమల్లుడను సిద్ధరాజు కట్టిదేవ రాజు కొడుకు. ఇతడే కాళహస్తిలోని రెండు శాసనములలో ఘట్టిదేవుండని పేర్కొనబడియున్నాడు. ఈ కడపటి వాడు మూడవ రాజరాజచోడ చక్రవర్తికి సామంతుడుగనుండి కప్పము గట్టుచుండెను. ఈ కట్టిదేవరాజునకును, ఆ వంశములోనివారే యగు తిరుక్కాళత్తిదేవునకును, నరసింహదేవునకు నెట్టి సంబంధముగలదో భావిపరిశోధనములను బట్టియే నిర్ధారింపనగును. తెలుగు చోడ వంశములోని వాడగు మధురాంతకపొత్తపిచోడయెర్రసిద్ధిరాజు రాజమల్లునకు సామంతుడుగనుండి కప్పముగట్టుచున్నటుల నూహింపదగియున్నది. [1]

మతసాంఘిక రాజకీయార్థిక స్థితులు

తెలుగుచోడరాజుల పరిపాలనకాలమున దేశములోని మతసాంఘిక రాజకీయార్థిక స్థితిగతులెట్లుండెనో వానినిగూర్చి కొంచెము చెప్పవలసియున్నది. ఆంధ్రదేశముయొక్క యాగ్నేయభాగమునందనగా కాంచీపురము,కడప,నెల్లూరు పట్టణములకు నడుమనుండు దేశముయొక్క మతసాంఘిక రాజకీయార్థిక స్థితిగతులకు చాళుక్యచోడచక్రవర్తుల పరిపాలనమునుబట్టిగాక పేరికిమాత్రము వారికి సామంతులుగనుండి నిజమైన అధికారమునంతను వహించిన తెలుగుచోడరాజులయొక్కయు, వారి సామంతులయొక్కయు పరిపాలనముబట్టి తెలిసికొనవలసియున్నది. పండ్రెడవ శతాబ్దము మొదలుకొని పదునాలుగవ శతాబ్దము వరకు నిన్నూరుసంవత్సరముల కాలమీతెలుగు చోడరాజులు పారతంత్ర్యమునంజిక్కి యైకమత్యములేక తమలోతాము పోరాడుచుండుటయు, పారతంత్ర్యమునుండి విడిబడి స్వతంత్రులగుటకై చేసిన ప్రయత్నములన్నియు భగ్నములగుటయు జూచినప్పుడు స్థూలదృష్టికి మతసాంఘికరాజకీయార్థికస్థితులభివృద్ధి లేక హీనతియందున్నవని పొడగట్టవచ్చునుగాని కొంచెము పరిశీలనచేసి సూక్ష్మదృష్టితో జూచిన పక్షమున నయ్యభిప్రాయము సరియైనదికాదని తోపకపోదు. సామంత మాండలిక రాజు

  1. Nellore Inscriptions Vol.III; P.1407. V.II.