పుట:Andhrula Charitramu Part 2.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీమన్మహామండలేశ్వర నందివర్మ మహారాజు కడపమండలములోని ప్రొద్దుటూరు రాజధానిగ గొంత యాంధ్రభూభాగమును బరిపాలించుచుండెను.

నందివర్మ మహారాజు

ఇతడు ముక్కంటి కాడువెట్టి వంశమున జయించిన దారపరాజునకు దుర్గాదేవియందు జనించిన పరాక్రమశాలియగు పుత్రుడు. ఇతని రాజ్యము నెల్లూరు మండలములోని పూగినాడు వరకు వ్యాపించియుండెను. ఇరుగరాజు, సమర్తరాజు నితని కన్నలు. భీమరాజు, బంధురాజు నితనికిదమ్ములు. ఇతడు శాలివాహన శకము 1024 అగు చిత్రభాను సంవత్సర వృషభమాసమున (అనగా క్రీ.శ.1102-03వ సంవత్సరమున) చోడపురమున బట్టాభిషిక్తుడయ్యెను. ఇతడు పెనుగోడు మాడురేని సీమలను బాలించుచు తన సామంతులతోడ సఖ్యమును వహించియుండి యొకానొక చంద్రగ్రహణ సమయమున పూగినాడులోని మ్రిదికల్లు,గుడిమట్ట, బద్దిమడుపు, కోకూరు, ఉప్పలపురము, రావిపాడు, ఇద్దుకులపాడు, బద్రుపడియ, సంగము, గోనుగుంట, గుడిపాడు గ్రామములను బ్రాహ్మణులకగ్రహారములుగా నిచ్చుటయేగాక, పాదటూరులోని యురుగేశ్వరునకును, దారేశ్వరునకును, దేవళములను మండపములను గోపురప్రాకారములను నిర్మించెను. మరియు వింధ్యవాసినియను గుడిని కట్టించెను. షోడరసముద్రం బను చెరువును త్రవ్వించెను. పంటకాల్వలను ద్రవ్వించి తూములను గట్టించెను. వృషభకేశ్వరునకును, దారేశ్వరునకును, భూదానములను చేసి పూలతోటలను వేయించెను. తల్లి దుర్గాదేవి పేర నొక మండపమును, తన యన్నయగు సమర్తరాజు పేర గోపుర ప్రాకారములను నిర్మించెను. మరియు నింకెన్నెన్నో దేవస్థానములకును, బ్రాహ్మణులకును, భూదానములు మొదలగునవి చేసి విఖ్యాతయశుడయ్యెను. ఇతడు వహించిన బిరుదములనుబట్టి స్వతంత్రుడని కనబడుచున్నను, మొదటి కులోత్తుంగచోడ చక్రవర్తికి లోబడియున్ యొక మహాసామంత ప్రభువనియే యూహింపదగియున్నది. తాను కాంచీపురములోని కామకోట్యంబిక యొక్క పాదభక్తుడనని చెప్పుకొనియుండుటచేత శాక్తేయమత మవలంబించిన వా