పుట:Andhrula Charitramu Part 2.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొమార్తయగు ఇమ్మడి శ్రీయాదేవియని యిప్పటికే మఱియొక శాసనమునుబట్టి దెలియుచున్నది. ఈ శాసనములంబట్టి తెలుగు చోడరాజులకును తెలుగు నాగరాజులకును సంబంధబాంధవములు గలవని స్పష్టముగా దెలియుచున్నది. దర్శిసీమలో జేరిన దర్శిపట్టణములోని యొక దేవాలయములో నాగవంశోద్భవుడైన ఆసనదేవ మహారాజు యొక్క శాసనములో నాతని వంశవృక్షము దెలుపబడినది. ఆ శాసనము క్రీ.శ.1384-85వ సంవత్సరమున వ్రాయబడినది. ఆ శాసనములోని వంశవృక్షమున ఆసనదేవరాజు తాతయగు వేములమలిదేవరాజునకు దాత నాగరాజని యొక నాగరాజు పేరు గానంబడుచున్నది. పైనుదాహరింపబడిన నాగదేవాజితడేయైయుండునేమో నిర్ధారించుటకు బ్రస్తుతము నొక్క యాధారమైన గానరాదు. దర్శి నాగరాజుల హరిత గోత్రులమని చెప్పుకొనియున్నారు గావున, వీరికిని పై గూడూరు శాసనములోని యాత్రేయగోత్రజులయిన నాగరాజులకు నే విధమయిన సంబంధము లేదని యూహింపవలసినది. నాగరాజులను గూర్చి మఱియొక ప్రకరణమునందు సవిస్తరముగా వివరింపబడును గావున, నిచ్చట వ్రాయుట విరమించుచున్నాడను.

ఇమ్మడి తిక్కరాజు.

మనుమసిద్ధి రాజునకు బిమ్మట సిద్ధిరాజుకొడుకగు రెండవతిక్కరాజు గద్దెనెక్కినటుల గానిపించుచున్నది. ఈ యిమ్మడి తిక్కరాజు శా.శ.1200 (క్రీ.శ.1278)వ సంవత్సరమున బట్టాభిషిక్తుయైనటుల గూడూరు సీమలోని కృష్ణాపట్టణములోని శాసనముబట్టి తెలియుచున్నది. ఇతడు సింహాసనమెక్కిన రెండవ యేటనే అనగా శా.శ.1201వ సంవత్సరమున మీనమాసమున శుద్ధదశమి గురువారమునాడు గండగోపాలపట్టణ మనియెడి కొల్లిత్తురై పట్టణమున నివసించయునట్టి వర్తకులు తిరుక్కావనమునందు సమావేశులై తాము చేసికొన్న యొడంబడిక ప్రకారమా రేవుపట్టణములో నెగుమతి చేయబడునట్టియు, దిగుమతి చేయబడునట్టియు, బస్తాల యొక్క మదింపు విలువనుబట్టి నూటికి నాలుగువంతున కొల్లిత్తురై గ్రామము