పుట:Andhrula Charitramu Part 2.pdf/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తిక్కనసోమయాజి.

తిక్కనసోమయాజి మంత్రి భాస్కరుని మనుమడనియు, కొమ్మనామాత్యుని పుత్త్రుడనియు, నిదివరకు దెలిపియుంటిని. ఆపస్తంబసూత్రుండును, గౌతమపుత్రుండు నగు కొమ్మనామాత్యుడు గుంటూరునకు దండనాథుడుగా నుండెను. గుంటూరి విభుడనగా గుంటూరి కరణమనియొక విమర్శగ్రంథమునందు సవిచారపూర్వకముగా వ్రాయబడినది. కొమ్మనదండనాథుడని తిక్కనసోమయాజియే విరాటపర్వములోని ఈ క్రింది పద్యమున బేర్కొనియున్నాడు.
"సీ. మజ్జనకుండు సన్మాన్య గౌతమగోత్ర
మహితుండు భాస్కరమంత్రి తనయు
డన్న మాంబాపతి యనగులు కేతన
మల్లన సిద్ధనామాత్యవరుల
కూరిమి తమ్ముండు గుంటూరి విభుడు కొ
మ్మన దండనాథుడు మధురకీర్తి
విస్తర స్ఫారుడాపస్తంబ సూత్ర ప
విత్ర శీలుడు సాంగవేదవేది,


గీ. యర్థిగలవచ్చి వాత్సల్య మతిశయిల్ల
నస్మదీయ ప్రణామంబు లాచరించి
తుష్టి దీవించి కరునార్థ్ర దృష్టి జూచి,
యెలమినిట్లని యానతి ఇచ్చె నాకు."


తిక్కనసోమయాజి యొకవేళ బక్షపాత బుద్ధితో తనతండ్రి సామాన్యుడై యుండగా దండనాథుడని పేర్కొనియుండవచ్చునని చెప్పవత్తురేమో? తిక్కన సోమయాజికి తన కావ్యము నంకితము చేసిన కేతనకవియు గొమ్మనామాత్యుని ధైర్యంబున హిమవంతునితోడను, శౌర్యంబున నర్జునునితోడను బోల్చి, సూర్యవంశ క భూపాల సుచిర రాజ్యవన వసంతుడని ఈ క్రింది పద్యములో మనోహరముగా వర్ణించియున్నాడు.