పుట:Andhrula Charitramu Part 2.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరమునకును తిథివారంబులకును బొసగపాటు గానరాదు. ఇది కాటమరాజునకును మనుమసిద్ధి రాజునకు గాక, పల్లురాజునకు నల్లసిద్ధిరాజునకు జరిగిన యుద్ధముగా జెప్పబడియెను. మనుమసిద్ధి రాజునుగూడ నల్లసిద్ధి రాజని పేర్కొనుచుండిరేమో. కాటమరాజు తాత పల్లురాజు. ఈ శాసనము ఎవ్వరో కొండయ్య కొడుకు రామయ్య యను నాతడు వ్రాయించినది గాని, యొక రాజుగాని యతని మంత్రులుగాని వ్రాయించినది గాదు. అది ఎప్పుడు వ్రాయబడినదియు దెలియరాదు. వీనినన్నిటిని బరిశీలించిచూడగా నది విశ్వాసపాత్రమైనదిగా గనుపట్టదు.

క్రీ.శ.1260వ సంవత్సరాంతము వరకు మనుమసిద్ధిరాజు బ్రదికి యున్నట్లుగా శాసనములు గానంబడియుండుట చేత నా సంవత్సరమునకు తరువాతనే కాటమరాజుకథ నిజమైన ఎడల మనుమసిద్ధిరాజు మరణము నొంది యుండవలయును. కృష్ణా మండలములోని నందిగామ సీమలోని అనమంచిపల్లె గ్రామమునందలి శివాలయముయొక్క గర్భాలయము ముందరి రాతిపలక మీది శిలాశాసనములు నాలిగింటిలో నొకదానియందు శాలివాహన శకము 1182వ సంవత్సరమునందనగా క్రీ.శ. 1260వ సంవత్సరమునందును; మరియు, కృష్ణామండలములోని నూజివీడు సంస్థానములో జేరిన కొండనాయని వరగ్రామముయొక్క చెరువుగట్టు మీద ఉన్న దేవాలయము సమీపమునందలి యొక రాతిమీద చెక్కబడిన శాసనములో శాలివాహన శకము 1179వ సంవత్సరమునందనగా క్రీస్తు శకము 1256వ సంవత్సరమునందును "మనుమరాజు" భూదానములు చేసినటుల జెప్పబడియున్నదని స్యూయల్ దొరగారి గ్రంథమునుండి కాబోలు నెత్తి యాంధ్రకవుల చరిత్రమునందు వ్రాయబడియున్నది. [1] ఆ శాసనములందు బేర్కొనంబడిన మనుమభూపతి నెల్లూరును బాలించిన యీ మనుమసిద్ధిరాజు కాడని స్పష్టముగా జెప్పవచ్చును.

  1. Lists of the Antiquarian Remains In the Presidency of Madras by Robert Sewell, Vol. I. pp. 43, 51.