పుట:Andhrula Charitramu Part 2.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

75

డాశ్రితుడై ఇతనింబ్రార్థించెనో, ఎట్లీతడాశ్రితవత్సల వృత్తి యేర్పడునట్లుగా నాచికొన్న రాజ్యాంగములనెల్ల నిచ్చి పదము గైకొనబంచెనో, యెంతమాత్రము బోధపడకున్నది. ఇదియే వాస్తవమగునేని సిద్ధేశ్వరచరిత్రమునందును, సోమదేవరాజీయము నందును, జెప్పబడిన విషయములయొక్క సత్యతనుగూర్చి ప్రశ్నింపవలసియుండును. ఏతద్విషయమై మరియొక తావున వివరింపదలంచితిని.

ఇంక మూడవపద్యమున నీతడు మహారాష్ట్ర సామంతుడైన సారంగుని జయించెనని చెప్పబడియున్నది. ఇందు బేర్కొనంబడిన సారంగుడు, అతి విషమహయారూఢ ప్రౌఢరేఖావంతుడును, పరబలాంకృతాంతుడును, శరణాగతవజ్ర పంజరుడును, మండలీకరవందోళియు, జీవరక్షచక్రనారాయణుడును, అగు మన్మహామండలేశ్వర శ్రీ సారంగపాణి దేవ రాజే గాని, యన్యుడుగాడని తోచుచున్నది. ఇతడు కాకతీయ గణపతిదేవునకు సామంతుడుగ నుండి అద్దంకి సీమకు బరిపాలకుడుగా నుండెను. ఇతని తండ్రి మాధవదేవరాజు. ఇతడు మనుసిద్ధికి సమకాలికుడైయుండెను. గోవిందనాయకుడీతనికి మంత్రిగనుండెను. ఇతని వంశమువారు మహారాష్ట్రములోని శౌణదేశమునుండి వచ్చినటుల దెలియుచున్నది. కాబట్టి నిర్వచనోత్తర రామాయణమున బేర్కొనంబడిన సారంగుడితడే యనుటకు సందియములేదు. ఇట్లు మనుమసిద్ధి కాకతీయ సైన్యాధిపతులతోడ బోరాడి విజయములనుగాంచినటుల గవితిక్కన వ్రాసియున్నాడు కాని, సిద్ధేశ్వరచరిత్రమునందును, సోమదేవరాజీయమునందును, దెలుపబడిన చరిత్రాంశములిందలిచరిత్రాంశములకు మిక్కిలి విరుద్ధములుగా గానిపించుచున్నవి.

అక్కన బయ్యనలు.

అక్కన బయ్యనలనువారు మనుమసిద్ధి రాజుయొక్క దాయాదులని సిద్ధేశ్వరచరిత్రమను శైవగ్రంథమునందు వ్రాయబడినది. సిద్ధేశ్వరచరిత్రమునకు బ్రతాపచరిత్రమను నామాంతరము గలదు. దీనిని కాసె సర్వప్పయను