పుట:Andhrula Charitramu Part 2.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొకదాని రంగనాయకస్వామి దేవాలయములోని యొక స్తంభముపై వ్రాయించెను. [1]ఆ సంవత్సరముననే విజయగండగోపాలదేవుడు కాకతీయుల సాహాయ్యమును బడసికాని, పడయక గాని జటవర్మసుందరపాండ్యదేవుని, వాని సైన్యములను నెల్లూరుమండలమునుండి బారద్రోలి యుండవలయును. ఈ విజయగండగోపాలునినే తరువాత మనుమసిద్ధి యెదిరించి పోరాడి విజయమును గాంచి యుండవచ్చును. విజయక్ష్మాధీశ్వరుండు జయించిన ద్రవిడోర్వీపతి సుందర పాండ్యుడుగాక కాంచీపురదాధిపతియైన వీరరాజేంద్ర చోడచక్రవర్తియే యైన యెడల 1250వ సంవత్సరమునకు బూర్వముననే మనుమసిద్ధి వానిని జయించియుండవలయును. పైన జెప్పిదే వాస్తవమైన యెడల 1250వ సంవత్సరము తరువాతనే నిర్వచనోత్తర రామాయణము రచింపబడి యుండవలయును. ఈ త్రిభువనచక్రవర్తి విజయగండగోపాలుడు, మనుమసిద్ధిరాజునకు సమకాలికుడు. ఇతడును తెలుగుచోడులలోని వాడుగానే కనబడుచున్నాడుగాని, సిద్ధిరాజు కుటుంబమునకు నీతనికెట్టి సంబంధముగలదో తెలియరాదు.

ఇంక రెండవపద్యమునందు బేర్కొనంబడిన గంగయసాహిణిం గూర్చి విచారింతము. ఈ గంగయసాహిణి, కాకతీయగణపతిదేవుని సైన్యమునకధ్యక్షుడును, రాజప్రతినిధియై నిజాము రాష్ట్రములో నిప్పుడు చేరియుండిన నల్లగొండసీమలోని పానగల్లు మొదలుకొని మార్జవాడిదేశము (కడపమండలములోని వల్లూరు రాజధాని) వరకుగల దేశమునంతయు బరిపాలించుచుండిన యొక యున్నత రాజకీయాధికారిగాని సామాన్యుడుగాడు. ఇతనికి బ్రహ్మరాక్షసుడని బిరుదుండుటచేతనే రక్సెగంగని పేర్కొనంబడియున్నాడు. ఇతని చరిత్రము గణపతిదేవుని గూర్చి వ్రాయు చరిత్రమున సవిసత్తరముగా దెలుపబడునుగాన, నిచ్చట విస్తరించి వ్రాయలేదు. ఇట్టి మహాపరాక్రమవంతుడైన గంగయసాహిణి నొక మండలాధిపతిగ నున్న మనుమసిద్ధి యెట్లు జయించి యతని రాజ్యాంగములెల్ల వాచికొనియెనో, ఎట్లాత

  1. Nellore Inscriptions, Vol II. No.61