పుట:Andhrula Charitramu Part 2.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయక్ష్మాధీశ్వరుని, రక్సెగంగని, మహారాష్ట్ర సామంతుడైన సారంగుని జయించెనని నిర్వచనోత్తర రామాయణములోని ఈ క్రింద నుదాహరించబడిన పద్యములంబట్టి గ్రహింపనగు.

“మ. ద్రవిడోర్వీపతి గర్వముందునిమి శౌర్యంబొపప గర్ణాటద
ర్ప విఘాతంబు నొనర్చి వైరిమనుజేంద్ర శ్రేణికిన్ గొంగనా
నవనిం బేర్కొనియున్నయట్టి విజయక్ష్మాధీశ్వరుం గాసిగా
నెవిచెం జోళనమన్మసిద్ధి యని బ్రాయేటంబ్రగాఢోద్ధతిన్.

ఉ. రగంగదుదారకీర్తి యగు రక్కెసగంగని బెంజలంబు మై
భంగమొనర్చి మన్మజవపాలుడు బల్విడి నాచికొన్న రా
జ్యాంగము లెల్లనిచ్చి తన యాశ్రిత వత్సలవృత్తి యేర్పడన్
గంగయసాహిణిం బదము గైకొనబరచె బరాక్రమోన్నతిన్.

శా. శృంగారంబు నలంగదేమియును బ్రస్వేదాంకుర శ్రేణిలే
దంగంబుల్ మెరుగేద వించుకయు మాహారాష్ట్ర సామంతు సా
రంగుం దోలి తురంగముంగొనిన సంగ్రామంబునందృప్తస
ప్తాంగ స్ఫారయశుండు మన్మ విభుపంపై చన్న సైన్యంబునన్.”

ఇందలి మొదటి పద్యమున ద్రవిడోర్వీపతి గర్వమును దునిమి కర్ణాటదర్ప విఘాతంబు గావించి శత్రురాజమండలికి గొంగయై యున్న విజయక్ష్మాధీశ్వరుని బ్రాయేటనే మన్మసిద్ధి సమరంబున బ్రగాఢోద్ధతిగాసిగా నెవిచెనని చెప్పబడియున్నది. ఇందు బేర్కొనబడిన విజయక్ష్మాధీశ్వరుండు త్రిభువనచక్రవర్తి బిరుదాంకితుడగు విజయగండగోపాలదేవుడని తోచుచున్నది. ఈ విజయగండ గోపాలదేవుని శాసనములు గాంచీపురమునం గానంబడుచున్నవి గాన, నీతడు ద్రావిడ మండలమును జయించి పాలించినవాడని చెప్పుటకు సందియము లేదు. ఇంతియగాక ఇతడు పాండ్యమండలాధీశ్వరుడయిన జటవర్మసుందర పాండ్యదేవుని యుద్ధముననోడించి తరిమినట్లుగ