పుట:Andhrula Charitramu Part 2.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిక్కనామాత్యునికంకితము చేయబడిన దశకుమారచరిత్రములోని వాక్యములకంటె బరమప్రమాణములయినవి మరియెవ్వికలవు? ఈ తిక్కరాజు మంత్రియైన సిద్ధనామాత్యునకు బ్రోలాంబికయందు నేడుగురు పుత్త్రులు జనించిరని దశకుమార చరిత్రములోని ఈ క్రింది సీసపద్యము వలన దెలియుచున్నది.

"సీ. విపులనిర్మల యశోవిసరగర్భీకృత
దిక్కుండు నా దగు తిక్కనయును,
దర్పితక్రూర శాత్రవ సముత్కరతమో
భాస్కరుండనదగు భాస్కరుండు,
న ప్రతి మానరూపాధరీకృతమీన
కేతనుండనదగు కేతనయును,
నిజభుజాబలగర్వనిర్జితోగ్రప్రతి
మల్లుండు నా దగు మల్లనయును,
శ్రీయుతుండు చౌహత్తనారాయణుండు,
మల్లనయు నీతి విక్రమమండనుండు,
పిన్న భాస్కరుండును బుధప్రీతికరుడు,
పెమ్మనయు నుదయించిరి పెంపు వెలయ."

మనుమక్షమావల్లభుండు.

తిక్కభూపాలుని కొడుకు మనుమక్షమావల్లభుండు. ఇతనినే మనుమసిద్ధియని చెప్పుదురు. ఇతడు మొదట చోడచక్రవర్తియగు మూడవ రాజరాజచోడునకు సామంతుడుగ నుండి తరువాత మూడవ రాజేంద్రచోడచక్రవర్తి కాలమున స్వతంత్రుడై కడపట కాకతీయాంధ్రచక్రవర్తి యగు గణపతిదేవునకు సామంతుడుగనుండెను. ఇతడు తన కాలమున మహావీరుడై శత్రురాజులనెదుర్కొని పోరాడుచు జయాపజయములను గాంచుచు వచ్చెనుగాని, తన తండ్రియైన తిక్కభూపతివలె నదృష్టశాలిమాత్రుడుగాడు.