జనమేజయుడు సర్పయాగము చేయుట.
తక్షకుడు తన తండ్రిని జంపినందున కాగ్రహోదగ్రుడై జనమేజయ మహారాజు నాగకులమునంతయు సంహరించుటకై యార్యఋషులనందఱిని బ్రేరేపించి సర్పయాగమును జేయసమకట్టెను. ఆ మహాయాగమునందు నాగులనేకులు పశువులుగ బట్టుకొనబడి సంహరింపబడిరి. నాగకులమంతయు నిర్మూలమగు కాలము వచ్చెను. అప్పుడు వాసుకి తోబుట్టువు కొడుకగు అస్తికుడను బ్రాహ్మణుని మూలమున తక్షకుడు మరణింపక జీవింపగలిగెను. ఈ యస్తికుడు నాగకులుడయినను అనార్యాచారములను వదలిపెట్టి యార్యాచారములనవలంబించి యార్యుడైనవాడు. ఇట్లే నాగకులు లనేకు లార్యాచారము నవలంబించి యార్యులలో గలిసిపోయెదమని వాగ్దత్తము చేయుటచేతనైన నేమి మఱియేమి కారణముచేతనైననేమి యా సర్పయాగము నిలిచిపోయినది. నాడు మొదలుకొని మరల నాలుగు శతాబ్దముల కనగా క్రీస్తు శకమునకు బూర్వము 691వ సంవత్సరము వరకు వీరల చరిత్రము వినరాక యుండెను. అప్పటికి నాగవంశజులయిన రాజులు మగధరాజ్యాధిపత్యమును వహించిరి. ఈ నాగవంశమె శిశునాగవంశమను పేరుతో మాగధమును బాలించినట్లు చరిత్రము లుద్ఘోషించుచున్నవి. ఈ శిశునాగవంశములో నాఱవవాడైన యజాతశత్రుని కాలముననే బుద్ధుడు జనించి యనార్యజాతుల కన్నిటికి బురోవృద్ధి కారకుడయ్యెను.
శిశునాగవంశము.
శిశునాగుడనువాడే శిశునాగవంశమునకు మూలపురుషుడు. ఈ శిశునాగుని జన్మమును గూర్చి బౌద్ధు లొక వింతకథను గల్పించియున్నారు. లిచ్ఛవి రాజులయొక్క యుంపుడుకత్తెలలో నొక్కతె యొక్క శిశువును గాంచెను. ఆ శిశువు స్వరూపమేర్పడక పూర్వమె ప్రసవించుటచేత నమ్మాంస పిండమునొక తట్టలో నుంచబడి రాత్రివేళ నొక పేడకుప్పలో వేయబడెనట. నగర పాలకుడయిన యొక నాగరాజు దానింగనిపెట్టి చుట్టును జుట్టుకొని తన పడగతో