పుట:Andhrula Charitramu Part-1.pdf/95

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నగు చిత్రవాహనునియొక్క కూతురు చిత్రాంగదయను నామెనుగూడ వివాహమైనట్టుగ జెప్పబడినది. అర్జునుని వలన నులూపికి జనించిన వాడు ఇరావంతుడను పేరుగలవాడు. ఇతడు భారతయుద్ధములో జనిపోయెను. అర్జునుని వలన జిత్రాంగదకు జనించినవాడు బబ్రువాహనుడను పేరుగలవాడు. ఇతడు బహు పరాక్రమవంతుడై భారత యుద్ధానంతరము ధర్మజుడు చేయబూనిన యశ్వమేధ యాగమును నిర్విఘ్నముగా నెఱవేర్ప బూని యర్జునుడు సవనాశ్వముతో బబ్రువాహనుని దేశమునకు వచ్చినప్పుడా సవనాశ్వమును బట్టుకుని తండ్రితో నత్యద్భుతముగ బోరి యోడించెను గాని తరువాత నులూపి మొదలగు వారిచే బ్రబోధితుడై యర్జుననుకు సహాయము చేసెను. ఈ కథలను బట్టి కొంతకాలము వఱకు నార్యులును నాగులును స్నేహభావముతోనే గడుపుచుండిరని తేటపడుచున్నది. పాండవులకు దరువాత సింహాసనమునకు వచ్చిన పరిక్షిత్తుకాలమున నార్యులకు నాగులకు వైరము పొసంగినది. అందులకు కారణమీ క్రింది విషయముగ గన్పట్టుచున్నది.

పరీక్షిత్తు తక్షకునిచే చంపబడుట.

అర్జునుని మనుమడైన పరీక్షిన్నరేంద్రుడు రాజ్యపాలనము చేయుకాలమునందొకనాడు మృగయావినోదార్థము నరణ్యమునకుంజని యా ఖేటఖేలనమున నలసి వచ్చుచుండగా మార్గమధ్యమున నొక్క ఋషి తపస్సు చేసికొనుచు నడిగినప్పుడు దాహమునైన దీర్పక మాటాడకపోవుటయె గాక కన్నులనైన దెఱచి చూడకపోయెను. అంతట నా రాజకుంజరు డాగ్రహించి యొక నాగమునుజంపి వాని మెడపై వైచిపోయెను. తరువాత నా సంయమివరేణ్యుని కుమారుడీ వృత్తాంతమునంతయు దెలిసికొని సర్పద్రష్టుడై చనిపోవునుగాక యని యారాజును శపించి వానిని జంప నాగరాజయున తక్షకుని బ్రేరేపించెను. ఆ శాపకారణమున నేడవనాడే తక్షకునిచే గఱవబడి పరీక్షిత్తు మృతినొందెనని చెప్పబడియెను. నాగరాజయిన తక్షకుడు తక్షశిలానగరమున కధిపతిగ నుండెనని గ్రంథములయందు బేర్కొనబడుచు వచ్చెను.