వేఱుపడి వచ్చి దస్యులతో గలిసి వర్తించుచుండుటచేత నార్యులు వీరినిగూడ దస్యులనుగానే భావించి వారినెట్లు చూచుచుండిరో వీరినిగూడ నట్లే చూచియుండవచ్చును. ఆర్యాంధ్రు లాకాలమున నీయరణ్యప్రదేశములయందు నాశ్రమముల నేర్పఱచుకొని యందందు నివసించుచుండిరిగాని వీరి ప్రదేశమార్యప్రదేశముగా నెన్నబడక యనార్యప్రదేశముగానే భావింపబడుచుండెను. ఆర్యాంధ్రులు మాట్లాడుభాష యసంస్కృతముగాని సంస్కృతభాషగాదు. అనార్యాంధ్రులు మాట్లాడుభాష పైశాచీ భాషగా నుండెను. ఆర్యాంధ్రులు మహారణ్య ప్రదేశమున ననార్యంధ్రజన మధ్యమున నివసించుచుండుటంజేసి వీర లార్యభాషకు నార్యాచారములకు దూరగులై తుదకు ననార్యసంబంధమె యొక్కుడుగా గలిగియుండిరి. ఆర్యాంధ్రులయొక్కయు అనార్యాంధ్రులయొక్కయు రక్తమిచ్చట సమ్మేళనమయ్యెను.ఆర్యాంధ్రుల యసంస్కృతంబును, అనార్యాంధ్రుల పైశాచీభాషయు నిచ్చట మిశ్రములగుచువచ్చెను. ఇట్లుకొంతకాలము జరుగునప్పటికి వీరెల్లరు నాంధ్రలయిరి. వీరు మాట్లాడుభాష యాంధ్రమయ్యెను. ఇదియొక ప్రాకృతభేదముగా నుండెను. ఐతరేయ బ్రాహ్మణకాలమునాటికి వింధ్యోత్తర ప్రదేశము మాత్రమె గాక యీ యాంధ్రదేశముగూడ కలదని యార్యులకు దెలిసియుండెను. మహాభారతము కురుపాండవులచారిత్రంబగుటం జేసియు గురుపాంచాలాదులును, దుష్యంత భరత పరీక్షిజ్జనమేజయాదులును నైతరేయ బ్రాహ్మణంబున బేర్కొనంబడియుండుటం జేసియు, నైతరేయ బ్రాహ్మణ మైతరేయుండను మహీదానఋషిచే మహాభారత యుద్ధానంతరమె దెలుపబడినదని తేటపడుటం జేసియు నాంధ్రులుగూడ మూడువే లేండ్లనుండి యున్నారని మనకు నిశ్చయుముగా దెలియుచున్నదిగాని యాకాలము మొదలుకొని యేడెనిమిది శతాబ్దముల వరకు ననగా గ్రీస్తుశకమునకు బూర్వము మున్నూరు సంవత్సరముల క్రిందట నుండి యేకచ్ఛత్రాధిపత్యము వహించి పాటలీపుత్రము రాజధానిగా భరతఖండము విశేషభాగమున బరిపాలించిన చంద్రగుప్తచక్రవర్తి కాలమునాటి వరకు మరల నాంధ్రుల ప్రశంస యే గ్రంథమునందును గానంబడదు.