Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాంతభూముల నివసించుచుండెడివారు. వీరు దక్షిణ హిందూదేశమునకు వచ్చినప్పుడు సేలము జిల్లాలోని కొల్లికొండలకడను. నీలగిరులకడను, పడమటి కనుమలకడను నివాసములనేర్పరచుకొనిరి. చేరరాజు లీతెగలోనివారుగా నుండిరి. హిమాలయమునందలి వనవారులలో జేరినవారమని చెప్పుకొనుచు నీతెగలోని రాజులు " పవనర్మన్, ఇమయవర్మన్ " అను బిరుదు పేరులను వహించుచుండిరి. ఈ రాజులు మాత్రమేగాక పర్వత నాయకులకు నన్నన్, ఆలంబిల్వెలు మొదలగువారు కూడా వనవాసనాయకులని యర్ధమిచ్చెడు "వనవీరల్వేలు" లని పిలుచుకొనుచుండెడి వారు. లంకాద్వీపమేలెడి గజబాహునకు (క్రీ.త.113-105 సమకాలికుడైన "చెంకుడ్డునాన్" అనియడు చేరరాజొకడు మగధదేశమును బాలించు చక్రవర్తియగు కర్ణునితో (ఆంధ్రరాజగు శాతకర్ణుడితో) సఖ్యము జేసికొని హిమాలయముకు సామీప్యమున నార్యులతో యుద్ధము చేసెనని చిల్లపది కారమను తమిళకావ్యమునందు జెప్పబడినది. ఈ చరిత్రము నాంధ్రరాజులగూర్చి వ్రాయుప్రకరణమునందు సంపూర్ణముగా దెలుపబడును.

కాబట్టి తమిళజాతులకు మ్రాన్మరులు, తిరయారులు, వనవారులనియెడు మూడు తెగలవారును దక్షిణ హిందూదేశమున పాండ్య చోళ చేర రాజ్యములను స్థాపించిరి. ఇందలి చేరరాజ్యమునే కేరళరాజ్యమందురు. అశోకుని కాలమునాటికే యీరాజ్యము లేర్పడి యశోకవర్ధన చక్రవర్తికి లోబడక స్వతంత్రమును వహించి యుండినవి.[1]

అయినను పౌరాణిక గ్రంధకర్తలు పాండ్యచోళ కేరళ రాజ్యముల స్థాపించిన జాతులవారి యుత్పత్తిని మరగుపరచి వీరలనార్యరాజుల సంతతి వారినిగా జెప్పియుండిరి. పాండ్య చోళ కేరళ కోలు లనియెడి వారు పురువంశజుడైన దుష్యంతుని మునిమనుమలుగా నగ్నిపురాణ హరివంశములో వ్రాసియుండిరి. వీరలే పాండ్యచోళ కేరళ కోల రాజ్యములను స్థాపించి తద్వంశములకు మూలపురుషులయినారని కూడ వ్రాసిరి. కాని విష్ణుపురాణమునందు దుష్యం

  1. Indian Antiquary, Vol xx p. 212.