దేశముయొక్క దక్షిణపుగొననుండిరి. ఆకావ్యమునందు లంకాద్వీపమున కెదుట నుండు సముద్రతీరమున నివసించుచుండిరని చెప్పబడి యుండెను. క్రీస్తుశకమునకు బూర్వ మయుదవశతాబ్ధమున విజయుడనురాజు లంకాద్వీపముపై దండెత్తివచ్చినప్పుడు డా ద్వీపము యక్షుల పరిపాలనము నందుండెను. ఆ విజయుడు మొదట కువేణియను యక్షరాజకన్యను వివాహమాడెను. ఈ మంగోలియాజాతి వారిలో బెక్కుండ్రు బంగాళములోని గంగానదీ తటముననుండెడి తామ్రలిప్తియను నగరమునుండి మొదట దక్షిణ హిందూదేశమునకు వచ్చి యుండిరి. ఆ తామ్రలిప్తియె పాలీభాషయందు "తమలిట్టీసు" (Ta-malittis) అని పిలువంబడినది. దీని నుండియె తమిళమను శబ్ధము పుట్టి యచ్చట నుండి వచ్చిన వారిని తమిళులనుచున్నారు. ఈ తమిళ శబ్ధమె యాంగ్లేయభాషలో "టమిల్" అనబడుచున్నది. తామ్రలిప్తులను, రోసలులతోను, ఉత్కలులతోనూ జేర్చి వంగదేశవాసులుగానూ, సముద్రతీరస్థులనుగానూ విష్ణుపురాణము వాకొనుచున్నది. ఈ మంగోలియా జాతులవా రేకకాలమున నందరు నొక్కమారుగ వచ్చిన వారు కారు. వీరిలో వేర్వేరు తెగలవారు వేర్వేరు కాలములందు వచ్చి యున్నారు.
మొదటి తెగవారు "పలయాన్ మారన్ " అనువారు. వీరికి గన్యాకుమారికడనుండు మోహూరనునది రాజధానిగనుండెను. పాండ్యరాజొకడు తానీ తెగలోని వాడినని చెప్పుకొని యున్నాడు. క్రీస్తుశకమునకు బూర్వమే బర్మాదేశమును జయించిన "మ్రాన్మర్" అనుజాతియను ఈమారన్ జాతియు నొక్కటియె యని యూహింపబడుచున్నది. పాలీభాషయందు వ్రాయబడిన బర్మాదేశ చరిత్రములందు మారమ్మదేశమని వ్రాయబడి యుండెను. అయినను మ్రాన్మదేశమనగా బ్రహ్మదేశమనియు
అదియే బర్మాదేశమైనదనియు కొందరు నుడువుచున్నారు. [1]
- ↑ Taw Sein Ko in the Indian Antiquary, Vol xxiii p 8.