ననేక విధముల బాధింప నారంభించినందున శత్రువులనుగ భావించి దస్యులని గూడపిలుచుచుండిరి.
ఆర్యులుకు వీరిభాష తెలియనందున వీరికి భాషలేదని చెప్పిరి. యజ్ఞాదికర్మలు వీరు చేయనందున వీరికీశ్వరుడు లేడనిరి. ఆర్యులకును దస్యులకును జరిగిన యుద్ధములు వేదములయందు వర్ణింపబడినవి. అనార్యు లాదిమనివాసులగుటచేతను ఆర్యులు క్రొత్తగవచ్చి తమభూము లాక్రమించుకొను చుండుటచేతను ఆర్యులకు అనార్యులకు నన్యోన్యకలహములేర్పడి యుద్ధములు జరుగుటలో వింతయేమియును లేదు. ఆర్యులు బలవంతులగుటచేత ననార్యులను వారిసుక్షేత్రభూములనుండి వెడలగొట్టి వాని నాక్రమించుకొనుచుండిరి. అనార్యులార్యుల యెదుట ముఖాముఖిని నిలువంబడి పోరాడలేక ఆర్యుల భుజబలంబునకు దాళగజాలక యరణ్యములలోను పర్వతగుహలలోను దాగియుండి రాత్రులందు నార్యుల నివాసస్థలంబులపై బడి పశువులను ధాన్యాదులను దోచుకొనుచు, ద్రోవలగొట్టుచు యజ్ఞాదికర్మల ధ్వంసము చేయుచు, స్త్రీలనెత్తికొనిపోవుచు నానావిధముల బాధపెట్టియుండిరి. మరియు నదులచేతను సెలయేళ్లచేతను సురక్షితములయిన స్థానములందు నివాసములేర్పరచుకొని నగరవాసులయిన యార్యుల కుపద్రవము సలుపుచుండిరి. అయినను ననార్యులు సులభముగా లోబడక బహుకాల మార్యులతో యుద్ధము సేయుచునే యుండిరి. ఋగ్వేదమునందనార్యుల కీకటదేశము వర్ణింపబడినది. ప్రమగందుడను రాజు కీకటదేశమును బాలించుచుండెనని చెప్పబడి యున్నది. "కీకటోనామధేశే నార్యనివాసః" అని యాస్కాచార్యులవారు నిరుక్తమునందు వ్రాసియున్నారు. "మాగధాఃకీకటాః మతాః "యని త్రికాండశేషమను కోశములో వ్రాయబడియున్నది. కనుక వైదికకాలములో గంగానదికి దూర్పువైపున గీకటము ననార్యజననివాసం బొండుగలదని తేటపడుచున్నది. ఆ కాలమునందలి సింధునదీప్రాంతదేశమునందలి యనార్యులకు కుయవడనువాడును,కృష్ణుడనువాడును నాయకులుగా నుండి బహుసైన్యములం జేర్చుకొని యార్యులతో ఘోరయుద్ధము చేసి సంహరింపబడిరనిఋగ్వేదమునందు జెప్పబడియెను. ఆర్యులు బహుకాలము