నాలుగవ ప్రకరణము
ఆదిమనివాసులు
ఆంధ్రదేశము పూర్వకాలమున నొకప్పుడు దండకారణ్యముగా నుండెననియు,ఆ కాలమున గిరాతజాతులవారు మాత్రమె నివసించుచుండి రనియు మనము దెలిసికొనియుంటిమి. ఆ కిరాతజాతులవారెవ్వరో, వారి వెనుక నెవ్వరెవ్వరీ దేశమునకు వచ్చి యుండిరో , వారెట్లు నాగరికులైరో మనము దెలిసికోవలసి యున్నది. ఈదండకారణ్యదేశమునందు ప్రప్రథమమున నివసించిన ప్రజలెట్టి వారో వారెందుండివచ్చిరో సత్యమెవ్వరికిని దెలియరాదు. ఇట్లని యూహించి చెప్పుటయు సులభసాధ్యముగాదు. వారెచ్చటివారయినను మిక్కిలి మృగప్రాయులుగా నుండియుందు రనుటకు సందియము లేదు. ఇప్పటి అండమానుదీవులలోనుండిన యనాగరికులను బోలియుందురని కొందరూహించుచున్నారు గాని వారియూహ సరియైనదికాదు. అండమానుదీవులలోని యనాగరికులు మిక్కిలి పొట్టివారుగనున్నారు. వీరిలో బురుషులు మూడుమూళ్ల మూడంగుళములను ఆడువాండ్ర మూడుమూళ్లును పొడవుమాత్రమే గలిగియున్నారు. వీరు బట్టకట్టుట నైన నెరుంగని స్థితియందున్నవారు . ఆకులను మొలకు ధరింతురు. చేపలను పీతలను పట్టుకొని తిని జీవింతురు. వట్టి మృగప్రాయులుగనున్నారు. వీరిపూర్వులే మొదటి నీదేశమున నివసించియుండిరని కొందరు వ్రాసియున్నారుగాని అదియెంతమాత్రమును విశ్వాసార్హమైనది కాదు. ఇప్పటి కృష్ణా గుంటూరు మండలములలోని నందిగామ, సత్తెనపల్లి పల్నాడు తాలూకాలో బెక్కు చోట్లను గుండ్రముగా మలచబడిన శిలలను శిలలతో జేయబడిన గృహోపకరణములు,అందములేని మట్టిపాత్రములు గాన్పించినందున నీయాంధ్రభూమి కొందరు తలంచుచున్నట్లు నిర్జనప్రదేశముగానుండక ప్రాచీనజననివాసభూమిగా నుండెనని మెకంజి, బిషప్ కాల్డువెల్లు మొదలుగు పాశ్చాత్యులు తలంచుచున్నారు. రాబర్టున్యూ