పుట:Andhrula Charitramu Part-1.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యున్నాఁడు. త్రికళింగమనుటకు త్రిలింగమని యుండవచ్చును. దీనినంతయును బట్టి చూడఁగా కళింగమునుబట్టియె యాంధ్రదేశమునకు త్రిలింగమను పేరు వచ్చినదనియే తలంచుట సముచితమని దోఁచుచున్నది. అయినను కళింగమునుండి త్రిలింగము పుట్టినదని మనపండితు లొప్పుకొనక త్రి+లింగ శబ్దములనుండి పుట్టినదనియు నీదేశమున మూడు ప్రసిద్ధలింగములు గలవనియు నందుమూలముననీదేశమునకుఁ ద్రిలింగ సంజ్ఞ కలిగినదనియుఁ జెప్పుదురు. సుచంద్రునికొడు కాంధ్రవిష్ణువనువాఁడు శ్రీశైలము[1]భీమేశ్వరము [2] కాళేశ్వరము[3]ను మహేంద్రపర్వతముతో గూడ, గలియునట్లుగా ప్రాకారములునిర్మించి యీమూటిని ద్వారములనుగాఁ జేసెననియు, ఈ ద్వారములందీశ్వరుఁడు శూలపాణియై ప్రమధగణములతోఁగొలువఁబడుచు లింగరూపములను దాల్చి యిందుండెననియు, ఆంధ్ర విష్ణువు సురులసహాయమును బొంది దానవాగ్రేసరుఁడగు నిశుంభునితోఁ బదమూండు యుగములు యుద్ధముచేసి వానిని హతముగావించి గోదావరి తటమునందలి ఋష్యాశ్రమములతో సహా వానినివాసము నాక్రమించు కొనెననియు, అప్పటి నుండియు నీదేశము త్రిలింగమనుపేరఁ బఱగుచున్నదని బ్రహ్మాండ పురాణమునందుఁ జెప్పఁబడినది.[4]

  1. కర్నూలుమండలము మార్కాపురము తాలూకాలోనున్నది.
  2. గోదావరి మండలములోని రామచంద్రపురము తాలూకాలోని దాక్షారామమను గ్రామము.
  3. కాళేశ్వరము హైదరాబాదు రాజ్యములో నెలగందల మండలమున గోదావరి నదితో నింద్రావతి సంగమించెడు స్థలము చెంత మంథనియను గ్రామమునొద్ద శివక్షేత్రము కాళేశ్వరము కలదు.
  4. శ్రీశైల భీమాకాళేశ మహేంద్రగిరి సంయుతం। ప్రాకారంతుమహ్త్కృత్వాత్రీణి ద్వారానుచాకరోత్॥ త్రిలోచనోమహేసస్స త్రిశోలంచకరే వహన్।త్రిలింగరూపీన్యవసత్ త్రిద్వారేషుగణైనృతః॥ఆంధ్రవిష్ణుస్సురయుతో దనుజేననిశంభునా। యుధ్వాత్రయోదశయుగాన్ హత్వాతుంరాక్షసోత్తమం అవసత్తత్రఋషిభిర్యుతో గోదావరీతటే॥తత్కాల ప్రభృతి క్షేత్రం త్రిలింగ మిత విశ్రుతం॥