Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నున్న వారని నిశ్శంకముగా నుడువవచ్చును. కృష్ణాగోదావరి నదీ ప్రాంతములందు వారు నెలకొల్పిన బౌద్ధసంఘారామములును స్థూపములును శిధిలములయ్యును నేటికిని గన్పట్టుచు నాంధ్రులయునికిని వేనోళ్ళ జాటుచున్నవి. ఐతరేయబ్రాహ్మణ కాలము నాటినుండి యాంధ్రులు దక్షిణాపథదేశమునందలి ప్రాగ్దిశనున్న యరణ్యప్రదేశములో నివసించు ననాగరికులుగానుండి క్రమక్రమముగా గాలము గడచినకొలది నాగరికులయిన ద్రావిడులయొక్కయు నార్యులయొక్కయు సహవాసము గలిగి వారలసంపర్కంబున దామును నాగరికులై పల్లెలు పట్టణములు నిర్మించుకొని బ్రజాస్థాపక సంఘముల మూలమున దొరతనము సేయుచు దరువాత నిరంకుశులై రాజ్యములు స్థాపించి తొల్లింటి రీతులను విడిచి నిరంకుశాధికారులయిన నాయకులకు దలయొగ్గి దొరతనము విడిచి పెట్ట వారలు విజృంభించి పశ్చిమమున మహారాష్ట్ర ఘూర్జరమాళ్వ కరూశకోశలాది దేశములను నుత్తరమున, కళింగమగధములను జయించి యాంధ్రరాజ్యము నానాదిశల వ్యాపింపజేసి విఖ్యాతయశులైరి. వీరికి దొలుత కృష్ణతీరమునందలి శ్రీకాకుళమును[1] దరువాత ధాన్యకటకమును[2] రాజధానులుగా నుండెను. రాజులు ధాన్యకటకమున బరిపాలనము సేయుచుండ యువరాజులు మహారాష్ట్రమునందు గోదావరీ తీరమునందుండిన ప్రతిష్ఠాన పురము [3]నందుండి ప్రభుత్వము సేయుచుండిరి. ఆంధ్రభృత్యవంశములో నొక తెగవారు శ్రీశలముకు సమీపమున జంద్రగుపపట్టణము రాజధానిగ జేసికొని పరిపాలనము చేసినట్టు గన్పట్టుచున్నది. ఆంధ్రులు గంగా తీర వాసులని ప్రబలప్రమాణము గాన్పించువరకు వారు దక్షిణాపథవాసులనియును వారిదేశము దక్షిణాపథదేశ మనియును అదియె కృష్ణాగోదావరీ నదీ గర్భదేశమనియును మనము విశ్వసింతము. ఈ యాంధ్రదేశ

  1. కృష్ణామండలములోని చల్లపల్లి జమిందారీలో నున్నది
  2. గుంటూరుమండలములోని సత్తెనపల్లి తాలూకాలోని అమరావతి ధరణికోట యనునవే ధాన్యకటకముగా నున్నవి
  3. గోదావరీ నది మీదనుండు పైఠవి అను గ్రామము