పుట:Andhrula Charitramu Part-1.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యులయినయాంధ్రులను కాళింగులును ప్రభుత్వములు చేసి శకనులతో బోరు పడలేక తూర్పుతీరముకు వచ్చిరనియు, వారిలో గాళింగులు గోదావరికి నుత్తరమున, ఆంధ్రులు కృష్ణా గోదావరులనడుమను స్థిరనివాసము లేర్పరచుకునిరనియు దరువాత గృష్ణాతీరమునందలి ధాన్యకటకమును రాజధానిగ జేసికొన యాంధ్రులు పశ్చిమ సముద్రమువరకు నాక్రమించి జగద్విఖ్యాత పరిపాలనము చేసిరని వ్రాసియుండిరి.[1] వీరు తమవాదమునకు బలముగా నుండుటకై ప్లీనీ వ్రాసినదానికి ప్రమాణముగా జూపుచున్నారు అయినను గంగానదికి దూరముగా నాంధ్రులుండిరని ప్లీనీ వ్రాయుచున్నాడు. సముద్రముకు మగధరాజ్యముకు నడుమ నాంధ్రరాజ్యముండుట యసంభవము. ఆకాలమందలి భరతఖండమునందలి రాజ్యములలో చంద్రగుప్తుని మగధరాజ్యము మేటి యని చెప్పదగియున్నది. ఆరులక్షల కాల్బలముతోను ముప్పదివేల యాశ్వికబలముతోను నొప్పియుండిన యీరాజ్యము ప్రక్కను లక్షకాల్బలమును, రెండువేలా శ్వికబలమును మాత్రము గలిగియుండిన యాంధ్రరాజ్య ముండుట పొసగనేరదు. ఈ యభిప్రాయముగానే జనరల్ కన్నింహ్యాం దొరగారు కూడా దెలిపియున్నారు.[2] ఇంతియగాక యశోకుని 13వ శిలాశాసనమందు "ఆంధ్రపుళిందేష్" అని యాంధ్రులు దక్షిణముననున్న పుళిందులలో జేర్పబడియున్నారు. ఆంధ్రులు గంగా తీరమునందుండిరిని యూహించుటకాధారము మగధరాజ్యము నాంధ్రరాజులు పాలించిరని పురాణములందు బేర్కొనబడుట తప్ప వేరొండు ప్రమాణము గానరాదు. మరియును క్రీస్తుశకము మొదటి శతాబ్దమున కనిష్కుడను శకరాజు మగధరాజ్యము ను జయించి నట్లును వాని సంతతి వారు కొంతకాలము దానిని పరిపాలించినట్లును నిటీవల నూతనముగా గనుగొనబడిన మధురలోని యొకశాసనము బట్టియు జిరకాలము నుండి యాంధ్రులు దక్షిణదేశమున

  1. Sir Walter Elliot's coins of Southern India
  2. Coins of Ancient India by Major. General Sir.A. Cunningham ; page 108.