శాసనములలో నెచ్చటను ఆంధ్రరాష్ట్రముల ప్రస్తావము లేశము లేదనియు"బహుశః" అప్పటికా హిందూభూభాగము బొత్తుగా నాగరికతలేక కొండకోయలకు నివాసస్థానమైన యుండనోపు నని డాక్టరు బర్నెలుగారు తమ ప్రాచీనలిపి శాస్త్రములో వ్రాసియున్నారు. [1] ఈ బర్నెలుగారి లేఖనమును జూచి భ్రమపడియె కాబోలు"అశోకుని శాసనములలో పెక్కు బలుతావుల బాండ్యచోళాదుల ప్రశంస కలదు. అప్పటికాంధ్రదేశమే యున్న ఎడల దీని ప్రశంస లేక యుండదు. అశోకుని కాలము క్రీస్తుశకమునకు బూర్వము సం|| 320అయిఉన్నది. అప్పటికీ భూభాగము వట్టి యరణ్యప్రదేశము. గాని జననివాస యోగ్యంబగు దేశము కాదు. ఈ సంగతినే మన గ్రంధములును దెలుపుచున్నవి." అని యొకరు వ్రాసియున్నారు. [2]
అశోకుని కాలము నాటికి నాంధ్రులు నాగరికులై పల్లెలు పట్టణములు దుర్గములు నిర్మించుకుని రాజ్యములు స్థాపించి ప్రభుత్వములు సేయుచుండి రనుటకు నశోకుని శాసనములే సాక్ష్యమిచ్చుచున్నవి. అశోకుని శాసనములో నాంధ్రుల ప్రశంస లేదనుకొనుట పొరబాటు. తనరాష్ట్రములోని వారల వలెనే యవనులును కాంభోజులును, నాభకులును, భోజులును, పైకాణితులును, ఆంధ్రులును, పుళిందులును, తనచే బ్రకటింపబడిన బుద్ధ ధర్మమును నవలంబించిరని 13వ శిలాశాసనమున నశోకుడు వ్రాయించెను. ఇంతియగాక యశోకుని పితామహుడు మౌర్యవంశస్థాపకుండునునగు చంద్రగుప్తుని యాస్థానమునం దున్న మేగాస్థనీనను రాయబారి యాంధ్రరాజ్యము మహోన్నత దశయందున్నట్లును ఆంధ్రరాజ్యమునందప్పుడు ముప్పదిదుర్గములును లక్షకాల్బలములును రెండువేల యాశ్వికులును వేయి యేనుగుల బలముండెనని వ్రాసియున్నాడు. ఈ విషయ