Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిర్ధేశించుటకు సాహసింపరాదని నిస్సంశయముగా జెప్పగలము. సంకల్పము చెప్పునప్పుడు "దండకారణ్యదేశే"యని చెప్పుకొనునది యొక్క మహారాష్ట్ర దేశస్థులు మాత్రమే కాదు. ఆంధ్రదేశస్థులు, అందుముఖ్యముగా కృష్ణాగోదావరీ మధ్యఖండమున వారు సహితము జెప్పుకొనుచున్నారు. ఇట్టి యాచారము ముండుటచేతను పైగ్రంథములలో నుదాహరింపబడిన దండకారణ్య వర్ణనలచేతను ఆంధ్రదేశము కూడా దండకారణ్యము లోనిదే యని విస్పష్టముగుచున్నది. ఇంతియుగాక పంచవటి కొందరు చెప్పినట్లు మహారాష్ట్ర దేశమునందుగాక యిప్పటి యాంధ్రదేశమునందే కలదని యాంధ్రుల యభిప్రాయమై యున్నది. శ్రీమద్రామాయణము నాసికపంచవటి వారి వాదము నెంతమాత్రము సమర్ధించుచుండలేదు. రామాయణమునందును భవభూతికృతమగు నుత్తర రామచరిత్రమునందును పంచవటి కడ గోదావరి వెడల్పుగానున్నట్లు చెప్పబడియున్నదని వారే యొప్పుకొనుచున్నారు . జన్మస్థానమునకు సమీపమునందున్న నాసికయం దట్లుకాదని జగద్విదితమైన విషయముగాన వేరు నుడువంబనిలేదు. ప్రస్తుతము గోదావరి మండలములోని భద్రాచలమునకు సమీపమున నున్న పర్ణశాలయే పంచవటియని యాంధ్రులు విశ్వసింపు చున్నారు. వాల్మీకి రామాయణములోని వర్ణననుబట్టియు, ఆధునిక విద్వాంసుల యభిప్రాయమునుబట్టియు, చూడగా వీరి నమ్మికయె నిజమైనదని తోచుచున్నది. రామాయణములోని పంచవటియే నాసికాపట్టణమగునేని రాముడు చిత్రకూటము నుండి నాసికకు వచ్చునప్పుడు మధ్యను వింధ్యపర్వతమును నర్మదానదియును దగులక మానవు. ఈ నదియును పర్వతముగూడ రాముని మార్గమున నున్నట్లు వాల్మీకి రామాయణమునందు వర్ణింపబడినదిశలను జూచినపక్షమున పర్ణశాల హిందూదేశమునకు దూర్పు ప్రక్కను నుండవలసినట్లూహింపవలసియున్నది. శ్రీరాముని దండకారణ్య మార్గమీక్రిందిరీతిగ నున్నది.

శ్రీరాముని దండకారణ్య మార్గము.

" సీతాలక్ష్మణ సమేతముగా శ్రీరాముడయోధ్య నుండి బయలుదేరి భరద్వాజాశ్రమమునకు వచ్చియుండెను. భరద్వాజాశ్రమము ప్రయాగలోను