ఆర్యులారా!
ఈ భరతఖండమున మనపూర్వులైనయార్యులు బహుపురాణములను, ఇతిహాసములను, శాస్త్రములను, కావ్యములను రచించి తమబుద్ధికౌశలమును వేయివిధముల మనకు ప్రకటించి యున్నారు. రామకృష్ణాద్యవతారముల విచిత్రలీలలేమి! మహార్షులతత్వజ్ఞానవిశేషములేమి! వీరపురుషుల యద్భుతపరాక్రమములేమి! మహాత్ముల పావనచరిత్రములేమి! పుణ్యస్త్రీలపాతివ్రత్యమహిమలేమి! రసవంతము లైన కావ్యములేమి! నీతిభోధకములైన కథలేమి! అన్నియును జదువుటకు ఆశ్చర్యమును ఆనందమును గలిగించుచున్నవి. అయినను ఇవియన్నియు మిక్కిలి ప్రౌఢమగు సంస్కృతభాషయందున్నవి. ఆ భాష యిప్పుడు జనులు వ్యవహరించుటలేదు గనుక అది యెవరో యొక కొందఱిపండితులకే తెలిసియుండును. కాబట్టి ఆ పురాణాది గ్రంథములలో గల గొప్పవిషయములు సామాన్యముగా ఎల్లవారికి, అందును మనతెనుగు దేశపువారికి అందని మ్రానిపండువలెఉండియు లభింపరానివిగా నున్నవి. ఆంధ్రభాషయందు నన్నయ, తిక్కన, పోతన మొదలగుకవులాగ్రంథములనువ్రాసిరికాని అందలివిషయము లన్నిటిని పూర్ణముగా తెనిగించినవారుగారు! తెనిగించినంతవఱకు గొప్పకవిత్వశైలియందుండుటచే అదియు అందఱికిని తేటగా తెలియునదికాదు. కాబట్టి, సంస్కృతమునందు సుప్రసిద్ధములుగా నున్న శ్రీవాల్మీకి రామాయణము, భాగవతము, భారతము, శ్రీవిష్ణుపురాణము, దశోపనిషత్తులు మఱియు ననేక గ్రంథములు ఆంధ్రదేశీయుల ఉపయోగముకై తేటతెనుగున మృదుమధురమైన వచనశైలిని పండితులకు రంజకముగాను పామరులకును, స్త్రీలకును