డు క్రీ.శ 1038వసంవత్సరము మే నెల మూడవతేదీని పట్టాభిషిక్తుడై 1070-1071 వ సంవత్సరము వరకు పరిపాలనము చేసెను.పర్లాకిమిడి, నడగాము మొదలగు ప్రదేశములందు వీనిదానశాసనములనేకములు గానుపించినవి. వీనితరువాత రాజరాజనువాడు 1070-1071న వచ్చి 8 సంవత్సరములు మాత్రము పరిపాలనము చేసెను. ఇతడు రాజరాజనరేంద్రుని మనుమరాలును, కులోత్తుంగచోడ దేవుని కూతురునునగు రాజసుందరిని వివాహమాడెను, ఈ రాజరాజునకు రాజసుందరికి జనించినవాడె అనంతవర్మ చోడగంగదేవుడు. ఇతడు 1078వ సంవత్సరమున సింహాసనమునకు వచ్చి 72 సంవత్సరములనగా 1151వ సంవత్సరమువరకు బరిపాలన చేసెను. గాంగుల పరిపాలనము వీనికాలమున మహోన్నత దశకు వచ్చెను. ఇతడు తనరాజ్యమును గంగానదివరకు వ్యాపింపజేసెను. గంగానది మొదలుకొని గోదావరినది వరకు గల దేశములో జరిగిన యుద్ధములలో నెల్లను విజయముగాంచుచువచ్చెను. వీని శాసనములనేకములు గంజాము, విశాఖపట్టణమండలములలో గాన్పించుచున్నవి. పూరిపట్టణములోని ప్రసిద్ధమైన జగన్నాధస్వామి యాలయము నితడే గట్టించెనని చెప్పుచున్నారు. వీనితరువాతి వారంత ప్రసిద్ధికివచ్చినవారు కారు. వారితరులకు సామంతులై యుండిరి. వారి చరిత్రము రెండవభాగమున సందర్భము కలిగిన తావున దెలుపబడును. వీరచరిత్రము విశేషపరిశోధనము జేయవలసి యున్నదిగావున నెక్కువగ వ్రాయసాహసింప జాలకపోతిమి.