Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యములోని తలకాడు రాజధానిగ గంగవాడి దేశమును బాలించుచుండిరి. తరువాత వారిలో నొకశాఖ వారు కళింగదేశమునకు వచ్చిన మహేంద్రగిరిని జయించి యీ దేశము నాక్రమించుకొని పరిపాలింపసాగిరి. ఈకాలమునందే దక్షిణ కళింగమును కుబ్జవిష్ణువర్ధనుడు జయించెను. తరువాత నాభాగము పూర్వచా‌ళుక్యులచే బరిపాలింపబడుచుండెనని విశాఖపట్టణమండలములోని చాళుక్యుల శాసనములే వేనోళ్లఘోషించుచున్నవి. కనుక గాంగులు కళింగదేశముయొక్క యుత్తరభాగమును మాత్రమే పరిపాలింపుచుండిరి. అన్యోన్యసంబంధమేమియు గానరాకయుండిన మొదటి గాంగులయొక్క నామములును వారి దానశాసనములను గంజాము, విశాఖపట్టణ మండలములో బెక్కుతావుల గానంబడుచున్నవి. ఇంద్రవర్మ, దేవేంద్రవర్మ, అనంతవర్మ, గుణార్ధవర్మ మొదలగు వారి శాసనములనేకములు గానంబడుచున్నవి. వీరలు మహేంద్రగిరిపైనుండు గోకర్ణస్వామి పాదారాధకులుగనుండిరి.

కళింగనగరము.

కళింగనగరము వీరికి రాజధానీనగరముగనుండెను. కొందఱు తలంచునట్లు గంజాము మండలములో సముద్రతీరమునందుండిన కళింగపట్టణము కళింగ నగరముగాదు. ఈ కళింగనగరము పర్లాకిమిడికి నిరువది మైళ్లదూరమున వంశధారయొడ్డుననున్నది. అదియిప్పుడు ముఖలింగమను పుణ్యక్షేత్రముగానున్నది. ఇక్కడ మధుకేశ్వరాలయము, అణ్యాంక భీమేశ్వరాలయము, సోమేశ్వరాలయములను మూడు ప్రసిద్ధములయిన శివాలయములున్నవి. ఈశివాలయములను గాంగులయొక్క శాసనములనేకములుగలవు. ఈ క్షేత్రమునకు దక్షిణమున రెండు మైళ్లదూరమున నగరికటకమను గ్రామముగలదు. ఈ గ్రామములనడుమశాసనలంగలిగియుండిన ఱాతిపలక లనేకములుగలవు. శిథిలమయిపోయిన పురాతనభవనములయొక్క చిహ్నములిప్పటికిని గానంబడుచున్నవి. అచ్చటి శివాలయములలోని శాసనములలో నాపట్టణము కళింగనగరమనియె పేర్కొనంబడియున్నది.