Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యను పేరు వహించినవారిలో నితడే మొదటివాడు. ఇంద్రవర్మయనియెడి యింద్రభట్టారకుడు వీనికొడుకు. పైజెప్పిన శాసనములలో రెండు వీనివిగానున్నవి, ఇయ్యవి విజయనగరమునకు సమీపమునందుండిన యొక పండిత కుటుంబమువారినుండి గైకొనబడినవి గనుక పరిశుద్ధమైనవిగానున్నవి. [1]

ఈ యింద్రభట్టారకుడు నిర్వక్రపరాక్రముండయిన మహాయోధుడని యభివర్ణింపబడియుండెను. విష్ణుకుండినులు సింహముద్రికయును సింహధ్వజమును గలవారుగనుండిరి. శ్రీపర్వతేశ్వరపాదారాధభక్తులమని విష్ణుకుండినులు చెప్పుకొనిరి. శ్రీపర్వతము శ్రీశైలమేయనియు, వీరలు శైవ మతావలంబకులనియును డాక్టరు కీల్ హారన్ గారు నుడువుచున్నారు. ఇంతియగాక విష్ణుకుండినుల శాసనములు వ్రాసినవారియొక్క స్వభాష తెలుగగుటంజేసియు శ్రీపర్వతేశ్వరుని పాదారాధకులమని చెప్పుకొనియుండుంజేసియు విష్ణుకుండిశబ్దము వినుకొండ శబ్దమూలమున ధ్వనించుచుండుటంజేసియు, విష్ణుకుండినులకు మొదట గుంటూరు మండలములోని వినుకొండ రాజధానిగనుండెనని తాము ధృఢముగా విశ్వసించుచున్నామని కీల్ హారన్ గారు నుడువుచున్నారుగాని యింకను విచారణీయము. ఇంద్రభట్టారకుడనియెడి యీ యింద్రవర్మ తనపరిపాలనముయొక్క 27 వ సంవత్సరమున పూ (కి) రాష్ట్రములోని పేరువాటక (పేరువాడ) మనుగ్రామమును దానముచేసియుండెను. ఈ పూ (కి) రాష్ట్రము కుబ్జవిష్ణువర్ధన మహారాజుయొక్క చీపురుపల్లి శాసనమునగూడ నుదాహరింపబడినది గనుక నిది విశాఖపట్టణమండలములోనిదిగాని యన్యముగాదు. కాబట్టి వీరిరాజ్యము మొదట విశాఖపట్టణమండలములోనిదై యుండవలయును గాని గుంటూరు మండలములోనిదిగాదు. ఇంద్రవర్మ తననివాసపురము పురణిసంగమని తెలిపియుండెను. ఇది యెక్కడిదో గుర్తింపనలవిగాకయున్నది. ఇంకను మఱొకచిక్కు గన్పట్టుచున్నది. ప్రభాకరమహారాజుకుమారుడగు పృధ్వీమూలునియొక్క గోదావరిశాసనము

  1. ఇయ్యవి బ్రహ్మశ్రీ గురుజాడ అప్పారావు పంతులుగారివలన సంగ్రహింపబడి దొరదినమువారి పరిశోధనాధికారికి బంపబడినవి,
    Annnul Report on Epigraphy 1909 para 62