పుట:Andhrula Charitramu Part-1.pdf/380

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వివాహమయ్యెను. ఈమె క్రీ.శ. 1082 మొదలుకొని 1159దవ సంవత్సరము వఱకు గళింగనగరము రాజధానిగా జేసికొని కళింగదేశమును బరిపాలించిన అనంతవర్మ చోడ గంగదే‌వునికి బంధువురాలయి యుండునని తోచుచున్నది. సత్యాశ్రయుని కొడుకయిన విజయాదిత్యుడు సూర్యవంశమున జనించిన విజయాదేవిని వివాహమయ్యెను. ఈమె చోడరాజపుత్రికయగునని తోచుచున్నది. ఈ విజయాదిత్యుని ద్వితీయపుత్రుడగు మల్లపదేవుడు సాగర విషయాధిపతియు. హైహయవంశజుడునగు నొక బ్రాహ్మణుని కూతురగు చందలదేవిని వివాహమయ్యెను. ఈ సాగరవిషయాధిపతియగు హైహయుడును కోనమండల మేలిన హైహయులు నొక్కవంశములోని వారేయై యుండవచ్చును. ఈ మల్లపదే‌వుని కొడుకగు విజయాదిత్యుడు అరదవాడ రాజపుత్రికను వివాహమయ్యెను. అరదవాడ యక్కడిదో దెలియరాదు.

ఈ వంశములోని కడపటివాడయిన మూడవ మల్లసదేవునకు విష్ణువర్థనమహారాజనియును, మల్లపదేవ చక్రవర్తియనియును బిరుదునామములు గలవు. ఇతడు పట్టాభిషేకము బొందినదినముననే ప్రొలనాడులోని గుడివాడ గ్రామమును, శ్రీపిఠాపురములోని కుంతీమాధవస్వామి దేవాలయమునకు ధారపోసెను. వెలనాటి చోడుడయిన పృథ్వీశ్వరుని పిఠాపురశాసనమునుబట్టియు, సర్వవరములోని శాసనములనుబట్టియు సర్పవరము సమీపమునందుండిన నవఖండవాడగూడ ప్రోలనాడులోనిదేయని తెలిసికొనియే యుంటిమి. శకటమంతినినాడులోని చాళుక్యభీమవరములోనున్న రాజనారాయణస్వామి దేవాలయములో మల్లపదేవుని శాసనములు రెండుగలవు. ఆ రెండు శాసనములలోను మల్లవిష్ణువర్థనుడు శాలివాహనశకము 1069దవ సంవత్సరమనగా క్రీ.శ.1147 వసంవత్సరములననే సింహసనమెక్కినట్లు దెలుపబడినది. ఈ భీమవరము శాసనములను పిఠాపురము శాసనములతో సమన్వయించుట కష్టసాధ్యముగనున్నది. పైరాజనారాయణదేవాలయములోనే శాలివాహనశకము 1098దవసంవత్సరములో మల్లపదేవుని సవతితమ్ముడయిన నరేంద్రుడు చేసిన దానశాసనమొకటిగూడ గానవచ్చుచున్నది. ఈ నరేంద్రుడు విజయాదిత్యునికి లక్ష్మీదేవి వలన జనించిన పుత్రుడని మఱియొక శాసనమును బట్టికూడ దెలియుచున్నది. కాబట్టి యింతకన్న వీరిని గూర్చి మఱియేమియునుదెలియరాదు.