పుట:Andhrula Charitramu Part-1.pdf/377

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నము చేయుచుండెడివారు. వీరిలో గడపటివాడైన కాటమనాయకుడు రెండవకులోత్తుంగ చోడదే‌వునకు సేనాధిపతిగనుండి యాతనిచే మెప్పుగాంచి గోదావరి మండలములోని చెల్లూరు గ్రామమును బహుమానముగ బొందెను. [1] మఱియు నితడు అత్తిలినాడులోని పాందువ్వ (భీమవరము తాలూకాలోనిది) గ్రామవాసియగు నొక బ్రాహ్మణునకు మంతదొఱ్ఱు (మందపఱ్ఱు భీమవరము తాలూకాలో గణపవరమునకు సమీపముననున్నది) గ్రామమును దానము చేసియుండెను. వీని శాసనములుకొన్ని యేలూరుమొదలగు ప్రదేశములం గానంబడుచున్నవి.

వెలనాటి మనుమగొంకరాజు.

ఇతడు వీరరాజేంద్రచోడునకు అక్కాంబికయందు జనించినవాడు. ఈ మూడవగొంకరాజు గిరిపశ్చిమశాసనులయిన కోనబుద్ధరాజు వంశమునందు జనించిన జయాంబికను వివాహమయ్యెను. ఇతడు రెండవకులోత్తుంగ చోడదేవునకు మాండలిక సామంతుడుగనుండెను. వెలనాటి కులోత్తుంగ చోడగాంగేయగొంకరాజనునది. వీనిసంపూర్ణనామము. వీనిశాసనములు క్రీ,శ. 1138 మొదలుకొని 1156 వఱకును గాన్పించుచున్నవి. వీనిభార్య జయాంబిక పిఠాపురములోని కుంతీమాధవ స్వామిదేవాలయమును గట్టించుటయెగాక సింహాచలములోని నృసింహుని విగ్రహమును సువర్ణముతో గప్పెను.

ప్రథ్వీశ్వరరాజు.

వెలనాటిచోడరాజులలో గడపటివాడు పృథ్వీశ్వరరాజు. ఇతడు మనుమగొంకరాజునకు జయాంబికయందు జనించినవాడు వీనిశాసనములు. క్రీ.శ, 1163 మొదలుకొని1180 వఱకును గానిపించుచున్నవి. ఇతడు రాజరాజచోడునకు సామంతుడుగనుండెను. వీనికాలమున వీనితల్లియగు జయాంబిక క్రీ.శ.1186-87వ సంవత్సరమును పిఠాపురములోని కుంతీమాధవస్వామి యాలయమునకు గంగయికొండ చోడవలనాడులోని యంతర్భాగమగు ప్రోలనాడు లో నున్న నవఖండవాడ (పిఠాపురమునకు దగ్గిరనున్నది) యను గ్రామమును దానము చేసియుండెను. అది యిప్పటికిని నాదేవునిక్రిందనే యుండెనని తెలియుచున్నది. ఈ పృథ్వీశ్వరరాజు విక్రమసింహపురమను బాలించుచుండిన మనుమ సిద్ధిరాజు తండ్రియగు చోడతిక్క నృపాలునిచే యుద్ధరంగమున జంపబడియెను.

  1. Ind. Ant. Vol XIV. p. 55.22