ఈ వెలనాటి ప్రభువులు తాము చతుర్ధాన్వయకులులమని చెప్పుకొని యుండుట చేత వీరలు క్షత్రియులుగారనియు, శూద్రులనియు దేటపడుచున్నది. వీరు శూద్రులయినను క్షాత్రమున క్షత్రియులకు దీసిపోయిన వారుకారు. వీరలును దాము చంద్రకులులమనియు, ఇంద్రసేన వంశజులమనియు జెప్పుకొనుచున్నారు. యుధిష్ఠిర మహారాజుయొక్క దత్తపుత్త్రుడయిన యింద్రసేనుడు మధ్యదేశమును కీర్తిపురము రాజధానిగా బరిపాలించుచుండెనట. వాని వంశమునందు కీర్తివర్మయను రాజు జనించెనట. వానివంశమునందు మల్లివర్మ పుట్టెను. వానికి రణదుర్జయుడు జనించెను వానికి కీర్తివర్మ, వానికి రణదుర్జయుడు, వానికి కీర్తివర్మ పుట్టిరట. కీర్తిపుర మెచ్చటనుగానరాదు. కీర్తివర్మ నామము చాళుక్యులవంశవృక్షమునుండి గ్రహించినట్టు గానంబడుచున్నది. రణదుర్జయుడనునది బిరుదునామముగా గానంబడుచున్నది గాని నిజమైన పేరుగ గానంబడదు.
ఈ వెలనాటి చోడవంశమునకు మూలపురుషుడయిన మల్లవర్మ త్రినేత్ర పల్లవుని సహాయముబొంది దక్షిణాపథముపై దాడివెడలి షట్సహస్ర దేశమును(ఆఱువేల నాడును) వశపఱచుకొనియెనట. త్రినేత్రపల్లవునితోడి మైత్రియు, దక్షిణాపథ దండయాత్రయును విజయాదిత్యుడు అయోధ్యనుండి వచ్చి త్రిలోచన పల్లవునితో యుద్ధముచేసెనని చెప్పెడు పూర్వచాళుక్యుల శాసనములలోని గాథలను జూచి కల్పించినగాథలుగ గన్పట్టుచున్నవి కాని నిజమైనవిగ గన్పట్టవు. విజయాదిత్యునికిని త్రిలోచన పల్లవునకును చాళుక్యుల గాథల విరోధముగలదని చెప్పియుండ నిచ్చట మల్లవర్మకు త్రినయిన పల్లవునకు మైత్రి చెప్పబడియెను.
ఆఱువేలనాడు.
షట్సహ ప్రదేశమను సంస్కృతనామమునకు తెలుగులో ఆఱువేలనాడని యర్థము. ఈ దేశము కృష్ణకు దక్షిణముననున్నదనియు దీనిక ధనపురము రాజధానియనియు జెప్పబడియున్నది. మొదట నీదేశము వెలనాటిచోడులకు