పదునైదవ ప్రకరణము.
వెలనాటిచోడులు.
వెలనాడనునది గుంటూరు మండలములోని చందవోలు ప్రాంతదేశమునకు మొదట వర్తించుచు దరువాత విస్తరించినది. వెలనాడు మండలమునకు చందవోలు రాజధానిగనుండెను. ఇయ్యది రేపల్లె తాలూకాలోనున్నది. [1] కాకతీయగణపతి దేవునియొక్క గణపేశ్వరము శాసనములో వెలనాడు రెండుమాఱు లుదహరింపబడినది. అమ్మరాజ విజయాదిత్యుని యెలవఱ్ఱు శాసనములో ఎలపఱ్ఱు వెలనాడు విషయములోనిదని చెప్పబడినది.
[2] ఈ యెలవఱ్ఱు రేపల్లె తాలూకాలో చందవోలున కుత్తరమున నున్నది. దాక్షారామములోని యొక శాసనములో కులోత్తుంగ మనుమ గొంకరాజు(మూడవగొంకరాజు) వెలనాడులోని సనదవ్రోలు పట్టణమున నివసించుచున్నట్టు చెప్పబడినది.[3] కాబట్టి యిప్పటి చందవోలె పూర్వము సనదవ్రోలని పిలువబడియుండెను. బ్రాహ్మణులలో వెలినాడు వారను నొక తెగ బ్రాహ్మణులు కలరు. వెలినాడనునది వెలనాడెగాని యన్యముగాదు. వెలనాడులో నివసించు బ్రాహ్మణు లన్యవిషయములకు బోయినప్పుడు వెలనాడు లేక వెలినాడు బ్రాహ్మణులని పిలువంబడుచుండిరి. తరువాత నీ వెలనాటి వారు బ్రాహ్మణులలో నొక శాఖావారుగా నేర్పడిరి. వెలనాడునకు బ్రభువులుగ నుండిన చోడులు చాళుక్య చోడుల యధికారము కిందను వారలకు బ్రతినిధులుగ నుండి వేంగి దేశమును బరిపాలించి మిక్కిలి ప్రసిద్ధిగాంచిన వారుగనుండిరి. పేరునకు మాత్రము చాళుక్యచోడులు రాజులుగనున్నను పరిపాలన భారమంతయును వీరె వహించియుండిరని చెప్పవచ్చును.