పుట:Andhrula Charitramu Part-1.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లు 1121-22 మొదలుకొని 13-24వఱకును దాక్షారామమునందుగాన్పించుచుండుటచేత నంతపర్యంతము నాతని వంశమునందే వేంగిదేశముండినదని భావింపవలయును. అయినను విక్రమచోడుని చేబ్రోలుశాసనము 1127వసంవత్సరమునాటిదిగను, నిడుబ్రోలు శాసనము 1135వసంవత్సరమునాటిదిగనుండుటచేత విక్రమచోడుడు 1125దవ సంవత్సరముననే విక్రమాదిత్యుని వేగిదేశమునుండి సాగనంపెనని మనము నిశ్చయింపకతప్పదు. విక్రమచోడుడు వృద్ధుడయిన తనతండ్రి కులోత్తుంగ చోడదేవుడు మృతినొందుట కొకసంవత్సరమునకు బూర్వమె అనగా 1118దవ సంవత్సరములో బట్టాభిషిక్తుడైనట్లు గానంబడుచున్నది. కులోత్తుంగుడు కొంచెమించుమించుగ నేబది సంవత్సరములు రాజ్యభారమును వహించి పరిపాలనము చేసియుండెను. విక్రమచోడుడు 1118 మొదలుకొని 1143వఱకు బరిపాలించెను. వీనికాలమున వేగిదేశము వెలనాటి చోడులవలన బరిపాలింపబడుచుండెను.

రెండవకులోత్తుంగ చోడదేవుడు.

ఈ రెండవకులోత్తుంగుడు విక్రమచోడునికొడుకు; విక్రమచోడునకు బిమ్మటరాజ్యమునకు వచ్చి1157వఱకును బరిపాలనము చేసెను. వీనికొడుకు రాజేంద్రచోడుడు పండ్రెండవశతాబ్దము వఱకును వీనికొడుకు రాజరాజచోడుడు లేక మూడవకులోత్తుంగ చోడదేవుడు 1232వఱకును చోడరాజ్యమును పరిపాలించిరిగాని వేంగిదేశము రెండవకులోత్తుంగ చోడదేవునికాలములోనె యన్యులవశమైపోయెను. ఈ రెండవకులోత్తుంగ చోడదేవుని యధికారముక్రింద వెలనాటిచోడులు కొంతకాలమును మఱికొంతకాలము వేఱొకశాఖవారయిన చాళుక్యులును, అటుపిమ్మట కాకతీయులును వేగిదేశమునకు బ్రభువులైరి.