డు 1118 వ సంవత్సరము వఱకు వేంగిదేశమునకు రాజప్రతినిధిగనుండి తరువాత తండ్రిమరణానంతరము చోడరాజ్యమునకు బట్టాభిషిక్తుడయి 1135వఱకును రాజ్యపరిపాలనము చేసినట్లు గన్పట్టుచున్నది. మల్లపదేవుని పిఠాపురము శాసనము విక్రమచోడునకు త్యాగసముద్రుడన్న బిరుదునామము గలదనియు విక్రమచోడుడు చోడదేశమును బరిపాలించుటకై వేగిదేశమును విడిచిపోయిన తరువాత వేగిదేశము కొంతకాలము పాలకుడలేకయె యుండెననియు దెలియజేసి యుండుటచేతను, విక్కిరావ్ చోలన్ ఉలయను ద్రావిడకావ్యము యొక్క కథానాయకునకు త్యాగసముద్రుడన్న బిరుదనామము గన్పట్టుచుండుటచేతను అతడునితడు నొక్కడేయని చెప్పవచ్చును. విక్రమచోడుని ద్రావిడశాసనములు విక్రమచోడుడు కొంతకాలము వేగిదేశములోనుండి చోడదేశమును బాలించుటకు వేగిదేశమును విడిచివచ్చెనని దెలుపుచున్నవి. చెల్లూరు పిఠాపురము తామ్రశాసనముల రెండింటియందును మధురాంతకదేవినామము పేర్కొనబడియుండినను విక్రమచోడుని నామము పేర్కొనబడియుండకపోవుటచేత నతడు మధురాంతగదేవియొక్క తనయుడగునోకాదోయని సందియము దోచుచున్నది. అయినను మధురాంతకదేవికి నేడుగురు పుత్రులుగలరని చెప్పబడియుండుటచేత విక్రమచోడుడుగూడ ఆమెపుత్రుడనియె నిర్ధారణము సేయవచ్చును.
ఆఱవశాసనములను బట్టి డాక్టర్ కీల్ హారన్ గారు చేసిన పరిగణన ప్రకారము క్రీస్తుశకము 1058దవ సంవత్సరము జూను 29వ తేదికి గొంచెమీవలనో కొంచెమావలనో విక్రమచోడుడు చోళరాజ్యమునకు బట్టాభిషిక్తుడయ్యెనని చెప్పవచ్చును. అఱవశాసనములనుబట్టి విక్రమచోడుని కాలమును మూడు యుగములుగా విభాగింపవచ్చును. అఱవశాసనములలో నితడు కళింగదేశముపై దండెత్తిపోయెనని చెప్పబడినది మొదటియుగముగా నుండెను. ఇది వేంగిదేశములో నుండుటకు బూర్వమె జరిగియున్నది గావున నితడు కులోత్తుంగచోడదేవుని కళింగదండయాత్రలో గూడ నుండియుండెనని చెప్పవచ్చును. ఆసమయమునందితడు సారసిపురాధ్యక్షుడయిన (Elllore)తెలుంగుభీ