అని యభివర్ణించియున్నాడు. కాబట్టి భూదేవకులాభితర్పణమహీయ ప్రీతియును, భారతశ్రవణాసక్తియును, పార్వతీపతిపదాబ్జధ్యానపూజామహోత్సవమును సంతతదానశీలతయును, శశ్వత్సాధుసాంగత్యమును తనకుగరం బిష్టంబులై యుండునని రాజనరేంద్రుడు చెప్పుకొన్న దానిలో నసత్యముగాని యతిశయోక్తిగాని లవమాత్రమును గానరాదు.
కృతఘ్నాపవాదములు.
నన్నయభట్టంతటివిద్యత్కవిరాజసింహునిచే.
"క. విమలాదిత్యతనూజుడు
విమలవిచారుడుఁ గుమారవిద్యాధరుఁడు
త్తమచాళుక్యుఁడు వివిధా
గమవిహితశ్రముడు తుహినకరుఁ డుగుకాంతిన్
చ. ఘనదురితానుబంధకలికాలజదోషతుషారసంహతిన్
దనయదయప్రభావమున దవ్వుగఁజోపిజగజ్జనానురం
జనముగ రాజ్యసంతతవసంతనితాంతవిభూతి నెంతయుం
దనరుజళుక్యమన్మథుఁడు ధర్మదయార్ద్రని బద్దబుద్ధియై
ఉ. ఆశ్రితపోషణంబున ననంతవిలాసమునన్ మనీషివి
ద్యాశ్రమతత్త్వవిత్త్వమున దానగుణాభిరతిని సమస్తవ
ర్ణాశ్రమధర్మరక్షణ మహామహిమన్ మహినొప్పు సర్వలో
కాశ్రయుఁ డాది రాజవిభుఁ డత్యకలంకచరిత్రసంపదన్."
అని సన్నతులను గాంచి "రాజమహేంద్రకవీంద్రసమాజసురక్ష్మాజ" యని సంబోధింపబడినవాడును, " సకలభువనలక్ష్మీవిలాస నివాసంబయిన రమ్యహర్మ్యతలంబున మంత్రిపురోహితసేనాపతిదండనాయక దౌవారికమహాప్రధానానంతసామంతపరివృతుండై అపారశబ్దశాస్త్రపారగులైన వైయాకరణులును భారతరామాయణాద్యనేక రచనావిశారదులయినమహాకవులును