పుట:Andhrula Charitramu Part-1.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డిన భారతరచనము మూలబడియుండవచ్చును. కాబట్టి మహాభారతరచనమునకు ముందే ఉభయ భాషాకావ్యరచనాభిశోభితుండై నన్నయభట్టును సంస్కృతప్రాకృతకర్ణాటపైశాచికాంధ్రభాషాకవిరాజశేఖరుండై నారాయణభట్టును ప్రసిద్ధిజెందియుండ నన్నయభట్టేయాదికవియనియు, ఆంధ్రభారతమే మొదటిగ్రంథమనియు, ఆంధ్రకవితాసతి నన్నయభట్టునకే జనించినదని చెప్పెడివారివాదము నెంతమాత్రమును మేము విశ్వసింప జాలకున్నారము.

పావులూరి మల్లనకవి.

ఇతడు తెనుగున గణితశాస్త్రమును రచించినమహాకవి. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; శివ్వన్న పుత్రుడు; అప స్తంబ సూత్రుడు గార్గ్య గోత్రోద్భవుడు; కమ్మనాడులోని పావులూరి గ్రామమునకు గరణమైయున్నాడు. ఈ కవి తనకు రాజనరేంద్రుడు పిఠాపురసమీపమున నున్న నవఖండవాడ యనుగ్రామము నిచ్చినట్లుగా నీక్రిందిపద్యమునంజెప్పుకొని యున్నాడు.

" ఉ. శ్రీలలనేశు డాంధ్రనృపశేఖరుడై చనురాజరాజభూ
పాలకులచేత బీఠపురిపార్శ్వమున న్నపఖండవాడయన్
ప్రోలు విభూతితో బడసి భూరిజనస్తుతుడైన సత్కళా
శీలుడ రాజపూజితుడ శివ్వనపుత్రుడ మల్లనాఖ్యుడన్."

దీనినబట్టి యీ పావులూరి మల్లనకవియు రాజనరేంద్రుని కాలమునందున్నవాడని స్పష్టపడుచున్నది. ఇట్లు నన్నయభట్టు నారాయణభట్టు పావులూరి మల్లన ఆంధ్రగ్రంథరచనయందు నిపుణులయినట్టు గానంబడుచుండగానాంధ్ర కవితాసతి అప్పుడే యవతరించినదని చెప్పెడిమాట యొట్లు విశ్వసింపవచ్చును. భాషయెన్నడు నొక్కసారిగ సంస్కరింపబడునదికాదు. ఆంధ్రభాషాసంస్కరణము నన్నయకు బహుకాలమునకుముందే ప్రారంభమయియుండును గాని యొక్కసారిగ సంపూర్ణస్థితికి దేబడెననుటయు విశ్వసింపదగినదికాదు.