నారాయణాఖ్య కరుణారసపూర్ణ వీర
శ్రీరమ్యరాజకుల శేఖరవిష్ణుమూర్తీ.
అని రాజనరేంద్రుని "నారాయణాఖ్యు"డనియు "విష్ణుమూర్తి"యనియు బొగడియున్నాడు.
కాబట్టి తావికి బరిమళమబ్బినట్లుగ నిట్టి రాజనరేంద్రునకు బలపరాక్రమవంతులయిన చోడులతోడ బాంధవ్య మబ్బుటవలనగూడ వీనిపరిపాలనము వేయివిధంబుల బరిశోభించి ప్రశంసనీయమయ్యెను. దేశోపద్రవకరములైన విషయంబువేవియును దటస్థింపక దేశమంతయు సుభిక్షముగా నున్నందునగాబోలుదనకుగలదానితో దృప్తినొంది పరరాజులతోడగయ్యెమునకు డీకొనక తనకాలమును విద్యావ్యాసంగములతోడ గడిపి యుండెను.
రాజమహేంద్రవరము.
రాజమహేంద్రపురము రాజమహేంద్రుడని బిరుదుగాంచిన అమ్మరాజు విష్ణువర్ధనునికాలములో యీరాజరాజ విష్ణువర్ధనునికాలముననో గట్టబడియుండును. ఎవరిచేత గట్టబడినను రాజరాజనరేంద్రునకు రాజధానిగనుండెననుటవాస్తవము. ఈ రాజమహేంద్రపురము వేగిరాజ్యములో మధ్యమభాగమున నుండుటచేత రాజనరేంద్రుడిందొకకోటనుగట్టి తనకు రాజధానిగ జేసి కొని చిరకాలము రాజ్యపాలనము చేసెను, రాజమహేంద్రపురము వేగిదేశంబునకు నాయకరత్నంబని నన్నయభట్టు మహాభారతమున జెప్పియున్నాడు, ఈపట్టణమునకుగలిగిన ప్రఖ్యాతి రాజనరేంద్రుని మూలమున గలిగినదేగాని మఱియొకరి మూలమున గలిగినది కాదు. అందుచేతనే విన్నకోట పెద్దన్న యనుకవి తనకావ్యాలంకారచూడామణిలో తనకృతికర్తయగు విశ్వేశ్వరమహారాజువంశమును వర్ణించునపుడు
"సీ. శ్రీకంఠచూడాగ్ర శృంగారకరణమే
రాజున కన్వ యారంభగురుడు