పుట:Andhrula Charitramu Part-1.pdf/329

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దానార్ణవుడు.

(క్రీ.శ.970 మొదలుకొని క్రీ.శ.973 వఱకు)

అమ్మరాజ విజయాదిత్యునికి బిమ్మట నతని సవతియన్నయు రెండవ చాళుక్యభీముని జ్యేష్ఠపుత్త్రుడునగు దానార్ణవుడు 970 దవ సంవత్సరమున రాజ్యభారమును వహించి973 వఱకు మూడు సంవత్సరములు రాజ్యపాలనము చేసెను. తరువాత 27 సంవత్సరములు దేశమరాజకమైనట్టు బహు శాసనముల వలన దెలియుచున్నది. ఈ కాలములో చోళులీ దేశమునకు దండెత్తి వచ్చినట్టును కొంతకాలము వేంగిదేశమును బాలించినట్టును కొందఱు వ్రాయుచున్నారుగాని, యది విశ్వసింపదగినది కాదు. వేంగి దేశమును జయించినట్టు చెప్పుకొనిన చోళరాజులలో మొదటివాడు రాజరాజ రాజకేసరివర్మ యనునాతడు. ఈ రాజరాజకేసరి వర్మ క్రీ.శ.985 దవ సంవత్సరమున చోళరాజ్యమునకు బట్టాభిషిక్తుడయ్యెను. ఇతడు తన పదునాలుగవ పరిపాలన సంవత్సరమున వేంగిదేశమును జయించినట్టు శాసనములు దెలుపుచున్నవి. కాబట్టి యితడు వేంగిదేశమును జయించిన సంవత్సరము 999వ సంవత్సరమగుచున్నది. చోళుల దండయాత్రవలన వేంగిదేశ మరాజకమైనదని చెప్పుట సత్యముగాదు. అరాజకమునకు వేఱుకారణములుండి యుండవలయును. వేంగిదేశ మిరువది సంవత్సరములరాజకము పాలయి కడగండ్లగుడుచుచున్న కాలమున ననగా 998వ సంవత్సరములోనో 999వ సంవత్సరములోనో చోళరాజగు రాజరాజ రాజకేసరివర్మ వేంగిదేశముపై దండెత్తి వచ్చి కలహములనడంచి దానార్ణవుని కార్య మహాదేవి వలన జనించిన పెద్దకొడుకగు శక్తివర్మను వేంగిరాజ్యమునకు బట్టాభిషిక్తుని గావించి స్వదేశమునకు బోయినట్లుగ గానంబడుచున్నది. ఇంతకన్న నాకాల స్థితి చాళుక్యశాసనముల వలన గాని చోడుల శాసనముల వలన గాని లేశమాత్రమును దెలియరాకున్నది.