Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజవిష్ణువర్ధను శాసనమువలన గానంబడుచున్నది. రాజ్యము చేయుచుండిన శాఖ వారిని ప్రతిఘటించి యీ శాఖలోని వారనేక పర్యాయములు రాజమాక్రమించుకొనజూచిరి కాని వీరి ప్రయత్నములన్నియు నిష్ఫలములయి పోయినవి. అయినను ఈ రెండవ తాళరాజు వెలనాటి సీమలో గొంత భాగమాక్రమించుకొని గొంతకాలము పరిపాలన చేసినట్లు గానిపించుచున్నది. వెలనాడు విషయములో నొక గ్రామమును పల్లవ మల్లుని వంశములో జనించిన కవివర్మయను వాని మనుమడగు కుప్పనయ్యయనువానికి రెండవ తాళరాజు దానముచేసినట్లు గుంటూరు శాసనమొకటి దెలుపుచున్నది.

పల్లవమల్లయనునది కాంచీపురమును పరిపాలించిన కడపటి పల్లవరాజగు నందివర్మయొక్క బిరుదునామమై యున్నది. అట్టి నందివర్మ పల్లవమల్లుని వంశములోని వాడగు కుప్పనామాత్యుడు తాళరాజునకు భృత్యుడైయాతని సేవించుచు నాతని కరుణకు బాత్రుడై యొక గ్రామమును బడసినది చూడ గాంచీపుర పల్లవరాజ వంశములోని యొక శాఖవారు వచ్చి యిప్పటి గుంటూరు మండలములో స్థిరనివాసమేర్పఱచుకొనిరని చెప్పుటకు తాళరాజు శాసనము పరమప్రమాణముగానున్నది. అమ్మరాజ విజయాదిత్యుని వలన జెప్పబడిన కుప్పనయ్య పల్లవమల్లుని వంశములోని వాడని చెప్పబడక పోయినను నిరువురొక్కడేయై యుండునని తోచుచున్నది. అయిన నీ యంశము విచారణీయము. ఈ కుప్పనయ్య స్వరాజ్య సమయమున తాళరాజునకు నధిక సాహాయ్యము చేసినందున విశ్వాసపాత్రుడై తాళరాజు వలన సమ్మానింపబడినట్లుగ నా శాసనమె చాటుచున్నది. చాళుక్యరాజుల ముద్రికలపై "శ్రీత్రిభువనాంకుశ"అను బిరుదునామము గన్పట్టుచుండగా తాళరాజు ముద్రికలపై "శ్రీత్రిభువనసింహ"యని గానంబడుచున్నది. కాబట్టి ఈ రెండవరాజు చాళుక్యసింహాసన మధిష్టించి వేగీ రాష్ట్రమును బరిపాలించినవాడు కాడనియు, కొంతకాలము మాత్రము కొంత ప్రదేశమాక్రమించుకొని పరిపాలించిన వాడని మాత్రము చెప్పవలసియున్నది. నిజముగా నితడు చాళుక్యసింహాసన మెక్కినవాడే యైన యెడల దనముద్రికలపై దప్పక త్రిభువనాంకుశనామముచే వహించియుండునుగాని తద్విరుద్ధమైన నామమును వహించియుండడు.