మొదటి చాళుక్యభీమునకు గూడ విష్ణువర్ధన నామముకలిగియుండుట చేత నితని నేడవవిష్ణువర్ధనునిగా బరిగణించవలసియుండును. వీనికి సర్వలోకాశ్రయుడనియు, రాజమహేంద్రుడనియు బిరుదు నామముండుట చేత రాజమహేంద్రవరము రాజధానిగ జేసికొని మొదట పరిపాలించినవాడే రాజమహేంద్రుడనియు, నీతని మూలముననే యాపట్టణమున కాపేరు గలిగినదనియు గొందఱు తలంచుచున్నారు. కోటలేని పట్టణ మాకాలమున రాజధానిగ నుండజాలదు. గావున నీత డాపట్టణమును నిర్మించి కోటనుగట్టుటకు బూర్వమె మృతినొందియుండునని మఱికొందఱు తలంచుచున్నారు. ఏది యెట్టిదైనను రాజమహేంద్రపురంబునకుం గల సంబంధమును సూచించుచున్నది. వీనిశాసనములలోని ముద్రికలపై శ్రీభువనాంకుశ అను చిరునామము గానంబడుచున్నది. ఇతడు రాజ్యమునకు వచ్చినప్పుడు వీని దాయాదులయిన బంధువులు కొందఱు చాళుక్యులకు శత్రువులయిన రాష్ట్రకూటులతో జేరి కుట్రలు చేసి వీనిని సింహాసనభ్రష్టుని జేయజూచిరి గాని యుక్తకాలముననే మేల్కొని యీ యమ్మరాజవిష్ణువర్ధనుడు వారి ప్రయత్నములను భగ్నము చేసి స్వజనముచే మెప్పుగాంచెను. వీనిపేరిటి శాసనములు రెండుగానంబడుచున్నవి. తనతండ్రియగు నాలవ విజయాదిత్యునకును దనకునుగూడ సైన్యాధిపతిగ నుండిన భండనాదిత్యునకు కాండేరువాడి విషయములోని గొంటూరు గ్రామమును చుట్టునుండు పండ్రెండుపల్లెలతోగూడ దానము చేసెను.[1] ఇంతియగాక మొదటి చాళుక్యభీముని దళవాయిగనుండిన మహాకాలునకు పెన్నాటివాడి విషయములోని ద్రుజ్జూరు గ్రామమును దానము చేసినట్లుగ మఱియొకశాసనము దెలుపుచున్నది. [2] కటకరాజు దూతకుడుగ నుండెను. గొంటూరు ప్రస్తుతగుంటూరు మండలములోని గుంటూరనియు, [3] ద్రుజ్జూరు నందిగామ తాలూకాలోని జుజ్జూరనియును గొందఱు తలంచుచున్నారు.
పుట:Andhrula Charitramu Part-1.pdf/322
Appearance