పుట:Andhrula Charitramu Part-1.pdf/319

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వారల రాజధానియగు మాల్యఖేతమును దగ్ధముగావించి కృష్ణపురదహన విఖ్యాతకీర్తియని స్వజనంబుచే బొగడ్తల బొందెను. రాష్ట్రకూటులకు సామంతులుగ నుండిన గాంగులు దండెత్తివచ్చినప్పడు ఘోరసంగ్రామమున వారలను జయించి తఱిమిగొట్టెను. మంగిరాజనుశత్రు వధికసైన్యముతో వచ్చి పైబడినపుడు ధైర్యసాహసములు ముప్పిరి గొన వాని నెదుర్కొని సంకులసమరంబున నవలీల వాని శిరస్సును ఖండించెను. వీని పేరిటి శాసనము లనేకములు గలవు. గుద్రవార విషయములోని (గుడివాడసీమ) త్రాండపఱ్ఱను గ్రామమును వినయాదిత్యశర్మకు చంద్రగ్రహణ సమయమున దానముచేసెను. ఈవినయాదిత్యశర్మ మంగిరాజుతో జరిగిన యుద్ధమునందు గణక విజయాదిత్యునిసైన్యాధిపతిగనుండి యుద్ధముచేసినట్లుగ గానిపించుచున్నది.[1] వేదవేదాంగవిధులును సమస్తశాస్త్రజ్ఞులు నైన 105 గురుబ్రాహ్మణులకు కోడముప్పఱ్ఱు, పోణంగి గ్రామములను దానము చేసినట్లుగ పోణంగి శాసనమువలన బోధపడుచున్నది.[2] గణక విజయాదిత్యునికి మంత్రిగను సైన్యాధిపతిగ నుండి గాంగులతోడను రాష్ట్రకూటులతోడను యుద్ధములుచేసి ప్రాణముల గోలుపోయిన పాండురంగనిపే రాశాసనముల నుదాహరింపబడినది. ఇతడు కడియరాజపుత్రుడని పేర్కొనంబడియెను. ఈ కడియరాజు పేరేమో తెలియరాదు. కడియయనునది రాజమహేంద్రవరమునకు నేడు మైళ్లదూరమున నుండిన కడియ మను గ్రామమై యుండవచ్చునని తోచుచున్నది. పాండురంగని పేరు నెల్లూరు శాసనములందును గూడ గానవచ్చచున్నది. ఈపాండురంగని కుటుంబము వారు జైనమతావలంబకు లయినట్లుగ గన్పట్టుచున్నారు. గణక విజయాదిత్యుని యనంతరము వీనిసోదరులగు యువరాజ విక్రమాదిత్యుడును, యుద్ధమల్లుడును ప్రసిద్ధులయినను రాజ్యపదవిని బొందక విజయాదిత్యునికి వెనుక యువరాజవిక్రమాదిత్యునికొడుకు చాళుక్యభీముడు రాజ్యపదవిని వహించుటకు గారణమేమో దెలియరాదు.

  1. Ind. Ant. Vol xx, P. 102;
  2. No. 538, Public,58. th July 1909. para 28