లిఖింపబడినది. విజయవాడయనునది బెజవాడకు బూర్వనామము. బెజవాడ పూర్వచాళుక్యులశాసనముల విజయవాడ యనియు విజయవాటిక యనియు బేర్కొనబడియున్నది. ఈ రెండవ విజయాదిత్యమహారాజు మఱియొకప్పుడు సూర్యగ్రహణ సమయమున కాండేరువాడి విషయములోని కామరూపిరేయగ్రామములోని పొలమును బ్రాహ్మణులకు దానము చేసినట్లు కృష్ణామండలములోని యీదరశాసనమువలన బోధపడుచున్నది. ఈశాసనమునందలి దూతకుడు బోలను యనువాడుగనుండెను.[1] ఈ రాజకంఠీవుడు నలువదినాలుగు సంవత్సరములు నిరాతంకముగా రాజ్యపరిపాలనము చేసి సుప్రసిద్ధమైన యశస్సునుగాంచెను.
కలివిష్ణువర్ధనుడు
నరేంద్రమృగరాజునకు వెనుక బూర్వచాళుక్యసింహాసన మధిరోహించినవాడు విష్ణువర్థన నామమునువహించి రాజ్యపరిపాలనము చేసిన పూర్వచాళుక్యులలో నితడైదవవాడు. వీనిని కలివిష్ణువర్ధనుడందురు. వీనికిసర్వలోకాశ్రయుడనియు విషమసిద్ధియనియు, పరమమహేశ్వురుడనియు బిరుదనామములు గలవు. ఇతడు రెండవ విజయాదిత్యుని కుమారుడు. ఇతడుతండ్రివలెనె శాసనములయందు వేంగినాథుడని పేర్కొనబడియెను. ఇతడు పదునెనిమిది నెలలుమాత్రమె రాజ్యపాలనము చేసెనని శాసనములు దెలుపుచున్నవి. వీనిపేరిట శాసనమొకటి గన్పట్టుచున్నదిగాని యందలి శైలి కఠినమైన దగుటచేత శాసనపరిశోధకులు సరిగ భాషాంతరీకరింపయిరి. పృథ్వీవల్లభపట్టణమని యొక పట్టణ ముదాహారింపబడినది. మఱియు నీ శాసనమునందు కర్ణాటకమును బాలించు ప్రభువునామ మొకటి పేర్కొనబడియెను. ఇంతియగాక కాంచీపురము రామేశ్వరము గూడ నుదాహరింపబడినవి. [2]