పినవాడు సామాన్య రాజకుమారుడుగాక నిరుపమాన విక్రముండని ఖ్యాతిగన్నట్టి రాష్ట్రకూటుడయిన మూడవ గోవిందరాజు. ఇతడు మాల్యఖేతమును రాజధానిగ మహారాష్ట్రదేశమును బాలించినవాడు. ఆ కాలమునాటి యోధవరులలో మేటియని చెప్పదగినవాడయినను, వేంగిరాష్ట్రమును స్వాధీనము జేసికొనవలయునని దృఢసంకల్పుడై యెంత ప్రయత్నించినను నమ నరేంద్ర మృగరాజుముంగట వాని ప్రయత్నము లన్నియు భగ్నములైపోయెను. ఇట్లనేక యుద్ధములలో దఱిమికొట్టబడియు రాష్ట్రకూట రాజయిన మూడవగోవిందరాజు తాను కాంచీపురమును జయించిన తరువాత పూర్వ చాళుక్యరాజునకు (నరేంద్రమృగరాజ బిరుదాంకితుడగు విజయాదిత్యుడు) కబురు పంపిన తోడనే యాతడుపోయి వానికి నౌకరువలె సేవ సలిపెనని యబద్ధపు సంగతులు తనశాసనములందు వ్రాయించుకొనియెనే గాని యీచాళుక్యడెన్నడును గోవిందరాజునకు నూడిగము సలిపినవాడుకాడు. ఇతడు గాంగులను రాష్ట్రకూటులను మాత్రమే గాక శత్రువర్గములో జేరియుండిన యొకనాగరాజును గూడ నితడు జయించెను. వీనిపేరు తోడిశాసనములు రెండుగానంబడుచున్నవి.
అందొకటి కొఱ్ఱపఱ్ఱుశాసనము. [1] చంద్రగ్రహణసమయమున కొఱ్ఱపఱ్ఱు గ్రామమునువేదవేదాంగవిదులయిన యిరువదినలుగురు బ్రాహ్మణులకు దానము చేసినట్లుగ నా శాసనమున జెప్పబడినది. కొఱ్ఱపఱ్ఱు కృష్ణా మండలములోనిదిగ గన్పట్టుచున్నది. విజయాదిత్యుని సోదరుడును రాజకుమారుడు నైన నృపరుద్రుడు దూతకుడిగ జెప్పబడియెను. మఱియు హైహయవంశములోని వాడని పేర్కొనబడియుండెను గావున నితడు విజయాదిత్యునికి సవతితమ్ముడని తోచుచున్నది. వీనితండ్రియగు నాలుగవ విష్ణువర్ధనుడు త్రిపురాధీశ్వరుని (కాలచుర్యుని) కొమార్తెను వివాహము జేసికొన్నందును నామెకు జనించిన యీ నృపరుద్రుడు హైహయవంశజుడని పేర్కొనబడియుండెను గాని మఱియొకటిగాదు. విజయవాడ నివాసియగు అక్షరలలితాచార్యునిచే నీ శాసనము
- ↑ South Ind Ins Vol l pp 31,36