నాలుగవ విష్ణువర్థనుడు.
ఈ విష్ణువర్ధనుడు మొదటి విజయాదిత్యుని కుమారుడు. విష్ణువర్ధననామమును వహించిన చాళుక్యరాజులలో నితడు నాలుగవవాడు, ఇతడు ముప్పదియాఱు సంవత్సరములు పరిపాలనము చేసెనని మాత్రము దెలియుచున్నది గాని వీనిగుఱించి యేమియును దెలియరాదు.
రెండవవిజయాదిత్యుడు.
ఇతడు నాలుగవ విష్ణువర్ధనుని కుమారుడు. విజయాదిత్యుని మనుమడు. బహుసమర్థుడయిన యోధవరుడు. మహారాజాధిరాజనియు, సమస్తభువనాశ్రయుండనియు, చాళుక్యార్జునుడనియు, రాజపరమేశ్వరుడనియు , శ్రీత్రిభువనాంకుశుడనియు, నరేంద్రమృగరాజనియు నింకననేకములగు బిరుదు నామములను వహించి 766వ సంవత్సరము మొదలుకొని 843 వ సంవత్సరమువఱకును నలువదినాలుగు సంవత్సరములు నిరాతంకముగా వేంగిరాష్ట్రమును బరిపాలించి కీర్తిగాంచెను. ఈ రెండవ విజయాదిత్యుడు రాజ్యభారమును వహించి నిర్వక్ర పరాక్రమంబున రాజ్యములోని శత్రువర్గము నడంచి నిరంకుళముగ బరిపాలనము సేయుచుండ మహాజన సత్త్వసంపన్నులగు రాష్ట్రకూటులును గాంగులును బలుమాఱులు వేంగిరాష్ట్రముపై దండెత్తివచ్చి విజయాదిత్యునితోడ బహుయుద్ధములు చేసి పలాయనులగుచువచ్చిరి. ఎన్ని తడవలు దాడివెడలి వచ్చినను నించుకయు జంకక సింహమువలె సుస్థిరచిత్తుడై నిలుచుండి శత్రువులకజేయుడై శత్రువర్గమునెల్ల దఱుముచువచ్చెను. అందుచేతనే చాళుక్యార్జునడనియు నరేంద్రమృగరాజనియు బిరుదుపేరులు గలిగినవి. ఇతడు గాంగులతోడను రాష్ట్రకూటులతోడను నూటయెనిమిది యుద్ధములను జేసివిజయమును గాంచినవాడగుటజేసి నూటయెనిమిది శివాలయములును తనదేశమునందంతట జ్ఞాపకార్థముగ గట్టించెనని కొన్ని శాసనములు చాటుచున్నవి. వీని శత్రువర్గములో ముఖ్యుడై నాయకత్వమును వహించి ఘోరయుద్ధములు సలి